షారుఖ్ ఖాన్‌కు చెన్నై మీడియా షాక్ | Shah Rukh Khan snubbed by journalists in Chennai | Sakshi
Sakshi News home page

షారుఖ్ ఖాన్‌కు చెన్నై మీడియా షాక్

Published Sun, Oct 5 2014 1:20 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

షారుఖ్ ఖాన్‌కు చెన్నై మీడియా షాక్ - Sakshi

షారుఖ్ ఖాన్‌కు చెన్నై మీడియా షాక్

చెన్నై, సాక్షి ప్రతినిధి : బాలీవుడ్ బాద్‌షాగా పేరుగాంచిన షారుఖ్ ఖాన్‌కు చెన్నై మీడియా వారు చుక్కలు చూపించారు. షారుఖ్ పదే పదే సారీ చెప్పినా ససేమిరా అంటూ శుక్రవారం రాత్రి జరగాల్సిన ప్రెస్‌మీట్‌ను బాయ్‌కాట్ చేశారు. మీడియా విలువ తెలుసుకుని మసలుకోవాలని హితవు పలికారు.ఇంతకూ విషయం ఏమిటంటే..., షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, దీపికా పదుకునే హీరోహీరోయిన్లుగా నటించిన ‘ హ్యాపీ న్యూఇయర్’ హిందీ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి షారుఖ్‌ఖాన్, అభిషేక్ బచ్చన్, దీపికా పదుకునే చెన్నైకి రావాల్సి ఉంది. చెన్నైలోని పామ్ శిల్క్స్‌వారు ఈ కార్యక్రమ ప్రచార భారాన్ని నెత్తిన వేసుకున్నారు. చెన్నైలోని ఒక ప్రముఖ హోటల్లో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రెస్‌మీట్, ఆ తరువాత ఫ్యాషన్ షో ఉంటుందని మీడియా వారికి రెండు వారాల ముందే ఆహ్వానాలు పంపారు. ప్రెస్‌మీట్ హాల్లోకి ప్రవేశంపై పాస్‌లు, చేతికి కలర్ రిబ్బన్లు ఇలా అనేక కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
 
 పెద్ద తారలతో ప్రెస్‌మీట్ కావడంతో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారు అరగంట ముందే అక్కడకు చేరుకున్నారు. మీడియా వారి ఎదురుగానే సోఫాలు, బెంచీలు, పూల గుత్తులు పెట్టడం, తాగునీటి బాటిళ్ల ఏర్పాటు చేసుకుంటున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బాలీవుడ్ ప్రముఖులు మీడియా ముందుకు రానేలేదు. ఎప్పుడు వస్తారో చెప్పే దిక్కుకూడా లేదు. దీంతో ఓర్పు, సహనం నశించిన మీడియా వారు నిర్వాహకులను నిలదీశారు. ప్రెస్‌మీట్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. పరిస్థితి చేజారిపోవడంతో కొందరు వ్యక్తులు వెళ్లి వేరేగదిలో ఉన్న షారుఖ్‌కు విషయం చెప్పారు. పరుగు, పరుగున అక్కడికి చేరుకున్న షారుఖ్ మీడియావారికి సారీ చెప్పారు. ఇంతలో అదే సినిమాలో విలన్ వేషధారి సోనూసూద్ కూడా వెలుపలకు వచ్చారు. ఇష్టానుసారంగా వ్యవహరించడానికి ఇది బాలీవుడ్ కాదు, చెన్నై మీడియా అంటూ హెచ్చరించారు.
 
 ఎంతగా బతిమాలినా బాయ్‌కాట్‌ను వెనక్కు తీసుకునే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. గత ఏడాది చెన్నై ఎక్స్‌ప్రెస్ ప్రమోషన్‌కు వచ్చినపుడు సైతం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు మీడియా వేచిఉండేలా చేశారని ఆయనకు గుర్తు చేశారు. చెన్నై మీడియాకు చేదు అనుభవం తొలిసారికాదు, రెండో సారని రెట్టించారు. షారుఖ్ మరీ మరీ బతిమాలడంతో మరోరోజు ఇదే కార్యక్రమాన్ని పెట్టుకోండి, అప్పుడు కవర్ చేస్తామని భరోసా ఇచ్చి వెనక్కు వెళ్లిపోయారు. బాలీవుడ్ ప్రముఖుల వైఖరి కారణంగా నిర్వాహకులకు రూ.కోటి వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. కొసమెరుపు ఏమిటంటే ముందుగా ప్రకటించినట్లుగా అభిషేక్ బచ్చన్, దీపికా పదుకునే చెన్నైకే రాలేదు కానీ, చాలా ఆలస్యంగా వచ్చి ఫ్యాషన్‌షోలో పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement