షార్ట్ ఫిల్మ్ @ : శైలజ..
ముదితల్ నేర్వగరాని విద్యన్‌గలదే.. ముద్దార నేర్పింపగన్.. అనే మాటలక న్నా.. అకుంఠిత దీక్ష.. నిరంతర కఠోర శ్రమ.. కష్టాల కడలిలో ఎదురీదడం.. అందివచ్చిన, అందుకోవాలనుకున్న అవకాశాలను దక్కించుకునే నైజంతోనే రాణిస్తామంటూ వర్ధమాన లఘు చిత్ర దర్శకురాలైన ఓ యువతి నిరూపిస్తోంది. ఆసక్తి ఉన్న రంగంలో కాసింత శ్రద్ధ పెడితే.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వయిస్తే.. అభిరుచికి, అభిలాషకు మరింత మెరుగులు దిద్దుకోవచ్చని, జీవిత లక్ష్యాలు సాధించవచ్చని చేతల్లో చూపుతూ యువతకు ఆదర్శంగా నిలుస్తోందామె. విభిన్న ఆలోచనలకు చదువు అడ్డంకి కాదని.. వినూత్న ఆలోచనతో షార్ట్ ఫిల్మ్స్ డెరైక్టర్‌గా ప్రస్థానాన్ని కొనసాస్తూ దూసుకుపోతోంది. భవిష్యత్తులో ప్రముఖ సినీ డెరైక్టర్ కావాలన్నదే తన జీవిత ధ్యేయమని చెబుతున్న ఆమె పలమనేరుకు చెందిన నాగరాజు, విజయమ్మ దంపతుల కుమార్తె శైలజ. ఆమె కథాకమామిషు మీ కోసం..
పలమనేరు:
షార్ట్ పిల్మ్ డెరైక్టర్‌గా శైలజ విశేషంగా రాణిస్తోంది. ఇప్పటికే పలు షార్ట్ ఫిల్మ్‌లకు దర్శకురాలిగా పని చేసింది. కొత్తదనంగా ఆలోచించి వినూత్నంగా చిత్రాలను తీస్తోంది. ఈ మధ్య ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాథ్ సాక్షి దిన పత్రిక సౌజన్యంలో నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్ కాంటెస్ట్‌లోనూ ఎంపికైంది. మారుమూల ప్రాంతం నుంచి సినీ రంగంలోకి ప్రవేశించడం అంత సులువు కాదు. కానీ తన లక్ష్య సాధనకు కష్టాలకు ఎదురొడ్డి ముందుకెళుతోంది. చదివింది ఇంటర్ వరకే. తొలి నుంచి సినీ రంగంపై ఉన్న ఆసక్తికి తోడు ప్రముఖ యాంకర్ సుమ ఇన్‌స్పిరేషన్‌తో యాంకర్ కావాలని కలలుకంది. ఎన్నో అడ్డంకులు. అవాంతరాలు.. అయినా మడమ తిప్పలేదు. ఒక్క ఏడాదిలోనే 22 ఉద్యోగాలు చేసింది. వేటిలోనూ సంతృప్తి కలగలేదు. వాటిని వదిలేసింది. ఎలాగైనా సినీ రంగంలో అడుగు పెట్టాలని లక్ష్యం బలంగా వేళ్లూనుకుంది. దీంతో ఇంట్లో వాళ్లను ఒప్పించి హైదరాబాదు చేరింది. జెమిని టీవీలో ప్రసారమైన కామెడీలో లైవ్ యాంకర్‌గా ప్రస్థానం మొదలైంది. ఆపై టీవీ సీరియల్ పాత్రలకు డబ్బింగ్, స్క్రిప్టు రైటింగ్‌తో పాటు పలు విభాగాల్లో పట్టు సాధించింది.
ఇప్పటికే పలు లఘు చిత్రాలు....
ఈ మధ్యనే పూరి జగన్నాథ్ డెరైక్టర్స్ హంట్‌లో ఈమె దర్శకత్వం వహించిన హ్యాపీ బ్రేక్‌అప్ ఎంపికైంది. అంతకు ముందు మూడు తరాల ప్రేమకథ, మంచిని వెతుకుదాం, ఓ అనాథ నాన్న కథ, అందమైన ప్రేమకథ(మూకీ), ఒకే భవనంలో దెయ్యం అనే లఘు చిత్రం తీయడం, భవిష్యత్తు ప్రేమలపై 2040, హత్య ఎలా జరిగింది? అనే షార్ట్ ఫిల్మ్‌లు ఈమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.
ఎన్నో ఇబ్బందులు..
చిత్రపరిశ్రమలో అవకాశాలు దక్కించుకోవడం పురుషులకే చాలా కష్టం. మరి ఓ మహిళా దర్శకురాలిగా రాణించాలంటే ఎన్నో అవరోధాలు అధిగమించాల్సిందే. తాను తొలి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో భోజనం కూడా చేయకుండా నిద్రించిన సందర్భాలు ఉన్నాయని శైలజ చెబుతోంది. ఉదయం నిద్ర లేచింది మొదలు అర్ధరాత్రి దాకా సినిమానే జీవితంగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ వస్తోంది.
కఠోరమైన శ్రమతో ముందుకెళ్లాల్సిందే....
నేను దర్శకురాలిగా సినీ రంగంలో మంచిపేరు తెచ్చుకోవాలనే కష్టపడుతున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో హార్డ్‌వర్క్ చేయాల్సిందే. నేను టీవీ రంగంలో పలు శాఖలో పని చేస్తూ ఆ సంపాదనతోనే లఘు చిత్రాలు తీస్తున్నా. ఈ మధ్యనే డెరైక్టర్‌గా అవకాశం వచ్చింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం.
- శైలజ, లఘుచిత్ర దర్శకురాలు