సాక్షి, ముంబై: వారసత్వ రాజకీయాలను అంతం చేస్తామని ఘనంగా ప్రకటించుకున్న ఎన్సీపీ లక్ష్యసాధనలో పూర్తిగా విఫలమైందంటూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ ఆదివారం చేసిన విమర్శలపై ఆ పార్టీ మండిపడింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ దీనిపై ఘాటుగా స్పందించారు. ఎన్సీపీని స్థాపించడం వల్లే పృథ్వీరాజ్ చవాన్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కిందన్నారు. ఎన్సీపీ తమ లక్ష్యసాధనలో విఫలమైనందున, ప్రజలు దానిని నిలదీయాలని చవాన్ అన్నారు. ఎన్సీపీ స్థాపించడం వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని కూడా మండిపడ్డారు. దీనికి పవార్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. షోలాపూర్ జిల్లా మాలీనగర్‌లో ఆదివారం జరిగిన ఓ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ఎన్సీపీ స్థాపించడం వల్లనే రాష్ట్రంలో ప్రజాస్వామ్య కూటమి (డీఎఫ్) కూటమి అధికారంలోకి వచ్చింది. మా పార్టీ స్థాపన వల్ల ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు అత్యధిక లాభం చేకూరింది. ఆయనతోపాటు పలువురికి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి లభించింది’ అని అన్నారు. వారసత్వ రాజకీయాల విమర్శలపై మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులెవరికీ తాను పదవులు కట్టబెట్టలేదని వివరణ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఓట్ల ద్వారా గెలిచి పదవులు చేపట్టారంటూ పృథ్వీరాజ్ చవాన్‌కు చురకలంటించారు.
సీట్ల పంపకాలపై చర్చలు జరగాల్సి ఉంది...
లోకసభ ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తి కాలేదని శరద్ పవార్ పేర్కొన్నారు. ‘దీపావళి పండుగ అనంతరం సీట్ల పంపకాలు, నియోజకవర్గాల్లో మార్పులపై చర్చలు జరిపేందుకు సమావేశం కావాలని భావించాం. కొన్ని అవాంతరాల వల్ల సమావేశం వాయిదా పడింది. లోక్‌సభ అభ్యర్థులు ఎవరనేదానిపై ఇప్పట్లో నిర్ణయం ఉండకపోవచ్చు. ఇందుకు కొంత సమయం పట్టవచ్చు’ అని పవార్ అన్నారు.
మిస్టర్‌క్లీనే కానీ మోసగాడు కూడా
ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మూడేళ్ల పాలనపై బీజేపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చవాన్ తన మిస్టర్‌క్లీన్ పేరును నిలబెట్టుకున్నా, ఆ ముసుగులో అవినీతిపరులకు సహకరించారని ఆరోపించింది. నీటిపారుదల, సాగునీటి కుంభకోణాలే ఇందుకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. ఆదర్శ్ కుంభకోణం నివేదిక వచ్చి ఆరు నెలలు అవుతున్నా, దానిని అసెంబ్లీ ప్రవేశపెట్టకుండా అవినీతిపరులకు కొమ్ముకాయడానికి చవాన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నివేదికను సభలో ప్రవేశపెడతామని కోర్టుకు ఇచ్చిన హామీ కూడా ఆయన పట్టించుకోలేదని పేర్కొన్నారు. తన శక్తియుక్తులన్నింటినీ ఎన్సీపీని ఎదుర్కోవడానికే పృథ్వీరాజ్ చవాన్ వినియోగిస్తున్నారని ఫడ్నవిస్ విమర్శించారు.
చవాన్‌పై పవార్ ఫైర్
Published Tue, Nov 12 2013 12:56 AM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM
Advertisement