
ఆమె ఓటమికి అంబి కారణం కాదు
- అంబరీష్ అభిమానుల సంఘం నేత బుల్లెట్ కృష్ణ
మండ్య, న్యూస్‌లైన్ : స్థానిక లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన రమ్య ఓటమికి రాష్ర్ట మంత్రి అంబరీష్ కారణం కాదని అంబరీష్ అభిమానుల సంఘం మండ్య జిల్లా అధ్యక్షుడు బుల్లెట్ కృష్ణ ఖండించారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రమ్యకు వ్యతిరేకంగా శ్రీరంగపట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్‌ఎల్ లింగరాజు, ఇండువాళ గ్రామానికి చెందిన సచ్చిదానంద పనిచేశారని, వారి చర్యల వల్లే ఆమె ఓటమి పాలైందని, ఈ నిందను అంబరీష్‌పై నెట్టివేసే కుట్ర సాగుతోందని మండిపడ్డారు.
రమ్యకు ఓటు వేయవద్దంటూ ఓటర్లకు ఫోన్లు చేసిన వీరిద్దరిని తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తగిన ఆధారాలను రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్‌కు అందజేసినట్లు తెలిపారు. అంబరీష్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏనాడు రమ్య ఓడిపోవాలని కోరుకోలేదని తేల్చి చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యంతో సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే రమ్య గురించి అంబరీష్ వాకాబు చేశారని గుర్తు చేశారు.
ఆమె విజయానికి కృషి చేయాలని తమందరికీ ఆయన సూచించారని తెలిపారు. అనారోగ్యంతో ఉన్నా రమ్య గెలుపు కోసం మండ్యలో అంబరీష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారని, ఒక వేల నిజంగా ఆమె ఓటమిని కోరుకునే వ్యక్తే అయితే ఎన్నికల ప్రచారం చేయాల్సిన అవసరం అంబరీష్‌కు ఏముంటుందని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో అంబరీష్ అభిమానుల సంఘం నేతలు కమలారాజు, ప్రేమ, రష్మి, భాగ్య, గౌరమ్మ, రత్నమ్మ, కాంగ్రెస్ నేతలు తమ్మేగౌడ, రాజేగౌడ, శివణ్ణ, బసవరాజు, తిమ్మేగౌడ, మంజునాథ్, చంద్ర, రవి పాల్గొన్నారు.