నల్లకుబేరుడు..శేఖర్ రెడ్డి పదవి పోయే
చెన్నై: ఐటీ దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారంతో పట్టుబడ్డ శేఖర్ రెడ్డిని టీటీడీ పాలకమండలి సభ్యుడి పదవి నుంచి ఏపీ ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత శేఖర్‌రెడ్డిని టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించిన విషయం తెలిసిందే. మరో వైపు శేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు శనివారం కూడా కొనసాగాయి. ఐటీ అధికారుల దాడుల నేపథ్యంలో రూ. 24 కోట్ల కొత్త కరెన్సీని వేరే చోటుకి తరలించాలని ప్రయత్నిస్తుండగా వేలూరులో అధికారులు పట్టుకున్నారు. శేఖర్ రెడ్డి నివాసం వద్ద ఆగివున్న కారులో 12 బాక్సుల్లో ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒకో బాక్సులో రూ.2 కోట్లు మేరకు కొత్త కరెన్సీ ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే శేఖర్‌రెడ్డితో పాటు ఆయన వ్యాపార భాగస్వాములు ప్రేమ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కిరణ్‌రెడ్డికి చెందిన చెన్నై, వేలూరు జిల్లాల్లోని ఇళ్లు, కార్యాలయాలపై గురువారం నుంచి జరిపిన దాడుల్లో పెద్ద 170 కోట్ల నగదు , 130 కిలోల బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు ప్రకటన తర్వాత మొదటిసారిగా పెద్దమొత్తంలో నగదు, బంగారం పట్టుబడిన ఈ కేసును ఐటీ శాఖ.. సీబీఐకి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.