గాంధీ సినిమా దర్శకుడు రిచర్డ్ అటెన్‌బరోతో కలసి పనిచేయడం అద్భుతమని ఇందులో కస్తూరీబా పాత్రలో కనిపించిన రోహిణి హట్టంగడి అన్నారు. ఆయన ఈ సినిమా స్క్రిప్టు ఇచ్చిన తరువాత, కథ నుంచి నటులెవరూ దృష్టి మరల్చకుండా జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశంసించారు. గాంధీ సినిమాతో ఆస్కార్ సాధించిన ఈ బ్రిటిష్ దర్శకుడు 90 ఏళ్ల వయసులో ఆదివారం మరణించారు. ‘కస్తూరీ బా పాత్ర నాకు ఎలా వచ్చిందో లీలగా గుర్తుంది. మరాఠీ నాటకాల్లో నటిస్తున్న సమయంలో డాలీ ఠాకూర్ అనే ఏజెంట్ వచ్చి రిచర్డ్ సార్‌ను కలవాలని చెప్పింది.
ఆయన ఢిల్లీ మీదుగా లండన్ వెళ్తూ ముంబైలో ఆగారు. నేను కూడా ఆ రోజు ముంబైలోనే ఉండడంతో గంటసేపు మాట్లాడగలిగాను. తెల్లవారి డాలీ ఫోన్ చేసి నాకు కస్తూరి పాత్ర దక్కిందని చెప్పింది. డాలీ సాయంతో ఎలాగొలా పాస్‌పోర్టు సంపాదించి లండన్ వెళ్లాను’ అని వివరించారు. రిచర్డ్ గాంధీ సినిమా నటులందరికీ స్క్రిప్టు ప్రతులు ఇచ్చి హోంవర్క్ చేయాలని సూచించేవారు. దీంతో రోహిణి కస్తూరీ బాపై వచ్చిన పుస్తకాలన్నింటినీ అధ్యయనం చేశారు. యాస లేకుండా ఇంగ్లిష్ మాట్లాడాలని సూచించడంతో ఈమె ప్రత్యేకంగా వక్తృత్వ తరగతులకు కూడా వెళ్లాల్సి వచ్చింది.
అంతేగాక చరఖా వడకడం నేర్చుకోవాలని గాంధీ పాత్రధారి బెన కింగ్స్‌లేతోపాటు తనకూ సూచించారని రోహిణి చెప్పారు. 1982లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి రెండు ఆస్కార్ అవార్డులు అందుకుంది. ‘అప్పుడు నా వయసు చాలా చిన్నది కాబట్టి కస్తూరి పాత్ర ప్రాధాన్యం సరిగ్గా అర్థం కాలేదు. కేవలం పాత్రలాగే భావించి చేస్తూపోయాను. తదనంతరం ఈ సినిమా ప్రచారం కోసం ఎన్నో దేశాలు తిరిగి తరువాత ఈ పాత్ర గొప్పదనం ఏంటో అర్థమయింది. నటన విషయంలో రిచర్డ్ నాకు ఎంతో స్వేచ్ఛ ఇచ్చేవారు’ అని వివరించారు.
రిచర్డ్‌తో పనిచేయడమే అద్భుతం
Published Tue, Aug 26 2014 10:28 PM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM
Advertisement