‘గాంధీ’ చిత్ర దర్శకుడు రిచర్డ్ అటెన్‌బరో కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, నటుడు, ‘గాంధీ’ చిత్రం ద్వారా మనదేశంలో సుప్రసిద్ధుడూ అయిన రిచర్డ్ అటెన్‌బరో (90) ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆదివారం మధ్యాహ్న సమయంలో తుది శ్వాస విడిచారు. దాదాపు అర్ధశతాబ్దం పైగా నటునిగా, దర్శకునిగా హాలీవుడ్‌కి రిచర్డ్ అందించిన సేవలు కొనియాడదగ్గవి. ‘ఇన్ విచ్ వియ్ సర్వ్’ చిత్రం ద్వారా 1942లో నటునిగా చిత్రరంగప్రవేశం చేశారు రిచర్డ్. అయితే, ఆ చిత్రం టైటిల్స్‌లో ఆయన పేరు ఉండదు. ఆ తర్వాత లండన్ బిలాంగ్స్ టు మీ, మార్నింగ్ డిపార్చర్, బ్రైటన్ రాక్ తదితర చిత్రాల ద్వారా నటునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అనంతరం 1950లో దర్శక, నిర్మాత బ్రయాన్ ఫోర్బ్స్‌తో కలిసి ఓ నిర్మాణ సంస్థ ఆరంభించి, ‘లీగ్ ఆఫ్ జెంటిల్‌మేన్’, ‘ది యాంగ్రీ సెలైన్స్’, ‘విజిల్ డౌన్ ది విండ్’ తదితర చిత్రాలు నిర్మించారు. నిర్మాతగా విజయవంతంగా కొనసాగుతున్న సమయంలోనే దర్శకునిగా మారారు రిచర్డ్. ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘ఓ! వాట్ ఎ లవ్లీ వార్’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత దర్శక, నిర్మాతగా కొనసాగడంతో దాదాపుగా నటన తగ్గించేశారు. మహాత్మా గాంధీ జీవితం ఆధారంగా ఆయన దర్శకత్వం వహించిన ‘గాంధీ’ చిత్రం ప్రపంచ ప్రేక్షకుల కితాబులు అందుకుంది. ఈ చిత్రానికి ఎనిమిది ఆస్కార్ అవార్డులు దక్కాయి.
ఆ చిత్రంలో గాంధీ పాత్ర పోషించిన బెన్ కింగ్‌స్లే ‘నా జీవితాంతం గుర్తుంచుకోదగ్గ చిత్రం ఇది. అటెన్‌బరోని మర్చిపోలేను’ అని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ చిత్రం స్క్రీన్‌ప్లే పుస్తకరూపంలో కూడా దొరుకుతోంది. ‘గాంధీ’ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో ‘చాప్లిన్’ ఒకటి. చార్లీ చాప్లిన్ జీవితం ఆధారంగా ఆయన ఈ చిత్రం రూపొందించారు. దర్శక, నిర్మాతగా కొనసాగుతున్న సమయంలోనే ‘జురాసిక్ పార్క్’లో చేసిన జాన్ హమ్మొండ్ పాత్రకు అభినందనలు అందుకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘పకూన్’. 2002లో ఇది విడుదలైంది.
దర్శక, నిర్మాతగా ‘క్లోజింగ్ ది రింగ్’ చివరి చిత్రం. 2007లో ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత అటెన్‌బరో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అనారోగ్యం కారణంగా కొంత కాలంగా ఆయన ఓ నర్సింగ్ హోమ్‌లో ఉంటూ, అక్కడే తుది శ్వాస విడిచారు. ఈ నెల 29న రిచర్డ్ అటెన్‌బరో తన 91వ పుట్టినరోజు జరుపుకోవాలి. ఈలోపే ఈ విషాదం సంభవించింది. 90 నిండి 91లోకి అడుగుపెట్టాల్సి ఉండగా, అనారోగ్యం ఆయనను కబళించింది. రిచర్డ్ మరణం పట్ల ఇంగ్లాండ్ ప్రధాని డేవిడ్ కామరూన్ సంతాపం వ్యక్తం చేస్తూ ‘గాంధీ’ చాలా గొప్ప చిత్రమనీ, అటెన్‌బరో మరణం హాలీవుడ్‌కి తీరని లోటని పేర్కొన్నారు.