నాసిక్: వచ్చే ఏడాది జరగనున్న కుంభమేళాకు సంబంధించి జిల్లాలో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్‌ఎంసీకి కేటాయించిన నిధులు తగిన రీతిలో అందకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. కుం భమేళా నిమిత్తం జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్రం నిర్ణయించింది. జిల్లాకు రూ.2,378.71 కోట్ల నిధులు కేటాయించేందుకు సీఎం పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత కమిటీ నిర్ణయించింది. వీటిలో ఎంఎంసీకీ రూ.1,052.61 కోట్లు కేటాయించారు. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎన్‌ఎంసీకి కేవలం రూ.222.17 కోట్లు అందజేసింది. కేంద్రం నుంచి ఎన్‌ఎంసీకి ఇంతవరకు నిధులు ఏమాత్రం అందలేదు. ఇదే సమయంలో, పనుల్లో తన వంతు నిధులను సకాలంలో విడుదల చేయాలని మున్సిపల్ కార్పొరేషన్‌కు డివిజనల్ రెవెన్యూ కమిషనర్(నాసిక్ డివిజన్) ఏక్‌నాథ్ దావ్లే లేఖ రాశారు.
‘అత్యున్నత కమిటీ, హై-పవర్ కమిటీ సమావేశాల సమయంలో కుంభమేళాకు సంబంధించిన పనులకు కేటాయించిన నిధుల్లో 33 శాతం అంటే రూ.350 కోట్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. మిగిలిన సొమ్ము (సుమారు రూ.700 కోట్లు)ను నాసిక్ మున్సిపల్ కార్పొరేషనే సమకూర్చుకోవాలని చెప్పింది. అయితే ఈ నెల మొదటి వారంలో జరిగిన కుంభమేళా సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరయ్యే రూ.350 కోట్లు, లోన్ల ద్వారా రూ.350 కోట్ల పైనే నివేదిక సమర్పించింది. మిగిలిన రూ. 352.61 కోట్ల నిధుల గురించి ఎటువంటి ప్రణాళిక రూపొం దించలేదు. కుంభమేళాకు ఇంకా ఎంతో సమయం లేదు. సాధుగ్రాం, తాత్కాలిక నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, తాత్కాలిక పార్కింగ్ స్థలాల ఏర్పా టు వంటి పనులు పూర్తి కావాల్సి ఉంది. నిధులు చూస్తే సకాలంలో అందడంలేదు.. ఇలా అయితే కుంభమేళా సమయానికి నిర్దేశించిన పనులు పూర్తిచేయడం కష్టమే..’ అని ఆ లేఖలో ఏక్‌నాథ్ స్పష్టం చేశారు.
కాగా నగర మేయర్ యతిన్ వాఘ్‌ను ఈ విషయమై సంప్రదించగా..‘కుంభమేళా పనుల పూర్తిలో ఎన్‌ఎంసీతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం సమాన బాధ్యత ఉంది. అలహాబాద్, ఇతర నగరాలకు కేంద్ర నిధులు అందాయి. మాకు కూడా కేంద్ర నిధులు విడుదల కావాల్సి ఉంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సంబంధిత కేంద్ర మంత్రిని కలిసి పరిస్థితిని వివరిస్తాం. ప్రస్తు తం మేము ఎన్‌ఎంసీ తరఫున నిధుల సమీకరణలో తలమునకలై ఉన్నాం..’ అని వివరించారు. వచ్చే ఏడాది జూలైలో కుంభమేళా జరగనుంది. ఎన్‌ఎంసీ కి కేటాయించిన 96 పనుల్లో రూ.529.55 కోట్ల విలువ చేసే 29 పనులను ఇప్పటికే ప్రారంభించా రు. వీటిలో రూ.432.49 కోట్ల ఖర్చు ప్రతిపాదనతో 17 రోడ్డు పనులు, గోదావరిపై రూ.16.97 కోట్ల అంచనాతో మూడు వంతెనలు, రూ.65.01 కోట్ల అంచనా ఖర్చుతో ఐదు నీటి సరఫరా పనులు, అలాగే రూ.15.08 కోట్ల అంచనా ఖర్చుతో నాలుగు మురికినీటి ప్రక్షాళన పనులు ఉన్నాయి.
కుంభమేళా పనులకు నిధుల కొరత
Published Sun, May 25 2014 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM
Advertisement
Advertisement