- కుమారకు సీఎం ప్రతి సవాల్
- అక్రమాల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు
- మొదట నీపై ఉన్న ఆరోపణల నుంచి బయటపడు
- రాష్ట్రంలో ఎక్కడా మోడీ ప్రభంజనం లేదు
- ‘హావేరి’ కాల్పులకు బీజేపీయే కారణం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారికి తాను రక్షణ కల్పిస్తున్నానంటూ మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ. కుమారస్వామి చేసిన ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించారు. దీనికి సంబంధించి ఆధారాలుంటే ఆయన వెంటనే విడుదల చేయాలని సవాల్ విసిరారు. హావేరిలో బుధవారం ప్రచారానికి వెళ్లడానికి ముందు హుబ్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
అక్రమ మైనింగ్ గురించి మాట్లాడే నైతిక హక్కు కుమారస్వామికి లేదని అన్నారు. అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఆయనపై ఉన్న ఆరోపణల నుంచి ముందుగా బయట పడాలని సూచించారు. కాగా రాష్ట్రంలో ఎక్కడా మోడీ ప్రభంజనం లేదని, బీజేపీ ఆ భ్రమల్లో ఉందని ఎద్దేవా చేశారు.
మోడీ దేవ లోకం నుంచి ఊడి పడలేదని, తనలాగే ఓ సీఎం మాత్రమేనని అన్నారు. హావేరిలో రైతులపై జరిగిన కాల్పులకు అప్పటి బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కనుక మాజీ ముఖ్యమంత్రులు జగదీశ్ శెట్టర్, సదానంద గౌడ, యడ్యూరప్పలకు రైతుల ఆత్మహత్యలపై మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు.