సాక్షి, చెన్నై : లారీల రవాణా పునరుద్ధరించని పక్షంలో దక్షిణ భారత దేశం వ్యాప్తంగా సమ్మె గంట మోగించాల్సి ఉంటుందని లారీ యజమానుల సంఘం ప్రకటించారు. కావేరి జలాల పంపిణీలో మళ్లీ కర్ణాటక కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించే పనిలో పడింది. ఇక, దేవే గౌడ కర్ణాటకలో దీక్ష చేపట్టడం తమిళనాట విమర్శలకు దారి తీశాయి. ఇక, కావేరి అభివృద్ధిమండలిలో తమిళనాడు ప్రతినిధులుగా ఎవ్వరెవ్వరికి చాన్స్ దక్కనున్నదో అన్న ఎదురు చూపులు పెరిగాయి.
కావేరి జల వివాదం జఠిలం అయ్యే కొద్ది రెండు రాష్ట్రాల మధ్య రవాణా పునరుద్ధరణ కష్టతరంగా మారింది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వ బస్సులు ఆ రాష్ట్రంలోకి, ఆ రాష్ట్ర బస్సులు ఇక్కడికి రావడం లేదు. అదే సమయంలో తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో కూడిన వాహనాలు ఆ రాష్ట్రంలోకి వెళ్లడం లేదు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల మీద ప్రభావం చూపించే విధంగా పరిస్థితులు నెలకొంటుండడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగి ఉన్నాయి. సరకుల లోడులతో వాహనాలు సరిహద్దుల్లో బారులు తీరి ఉండడం ఓ వైపు, వాహనాలు రోడ్డెక్కకుండా షెడ్లకు పరిమితం కావడం మరో వైపు వెరసి ఆయా యజమానుల్లో ఆందోళనలో పడేసి ఉన్నది. దీంతో దక్షిణభారత లారీ యజమానుల సంఘం హొసూరులో శనివారం సమావేశం అయింది. రెండు రాష్ట్రాల మధ్య రవాణా పునరుద్దరించాలని,లారీలు, సరకు వాహనాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు సిద్ధం అయ్యారు.
రెండు రోజుల్లో లారీల రవాణా పునరుద్ధరించని పక్షంలో ఈనెల ఐదో తేదీ నుంచి సమ్మె సైరన్ మోగించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విషయంగా ఆ సంఘం నేత షణ్ముగప్ప మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల మధ్యవర్తకం ఆగి ఉండడంతో రోజుకు ఐదు వేల కోట్ల మేరకు వరక్తం ఆగి ఉండడంతో, ఆగిన వర్తకం కారణంగా తాము కోట్లాది రూపాయాల్ని నష్ట పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో వాహనాలకు నిరసన కారుల కారణంగా దెబ్బ తిన్నాయని, వీటన్నింటికీ నష్ట పరిహారం చెల్లించాలని, రవాణా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ , ఐదో తేదీ నుంచి లారీల సమ్మెకు నిర్ణయించామన్నారు. లారీ యాజమన్యాలు ఓ వైపు హెచ్చరించే పనిలో పడితే, మరో అన్నదాతలకు మళ్లీ మొండి చేయి మిగిల్చే విధంగా కర్ణాటక కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించే పనిలో పడింది.
మళ్లీ ఉల్లంఘన : శనివారం నుంచి ఆరో తేదీ వరకు తమిళనాడుకు సెకనుకు ఆరు వేల గణపుటడుగుల మేరకు నీటిని విడుదల చేయాల్సిందేనని కర్ణాటక సర్కారుకు శుక్రవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఉత్తర్వుల్ని అమలు చేయకుండా ఉల్లంఘించే పనిలో అక్కడి పాలకులు పడ్డారు. దీంతో కావేరిలో నీరు కాన రావడం లేదు. ఇదే చివరి హెచ్చరిక అని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా కర్ణాటక పాలకులు పెడచెవిన పెడుతుండటం తమిళనాట మరింత ఆక్రోశాన్ని రగుల్చుతున్నది.
దేవేగౌడ తీరుపై విమర్శలు : సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ, తమిళనాడుకు నీటి విడుదలను అడ్డుకునే విధంగా మాజీ ప్రధాని దేవే గౌడ బెంగళూరులో దీక్ష చేపట్టడం తమిళనాట విమర్శలు బయలు దేరాయి. బాధ్యత గల పదవిలో గతంలో పనిచేసిన దేవేగౌడ లాంటి వాళ్లు ఇలా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించే పనిలో రాజకీయ పక్షాల నాయకులు ఉన్నారు. బీజేపీ సీనియర్ నేత ఇలగణేషన్ పేర్కొంటూ, ఆయన ఈ నిర్ణయం తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సొంత ప్రయోజనాలు, రాజకీయలబ్ధికి ప్రయత్నిస్తున్నట్టుందని మండి పడ్డారు. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ పేర్కొంటూ, అదృష్టం లేదా దురదృష్టం వెరసి దేవే గౌడ గతంలో ప్రధాని అయ్యారని , అయితే, ఆ పదవికి మచ్చ చేకూర్చే విధంగా ఆయన ఒక్క రాష్ట్రం కోసం దీక్షలో కూర్చోవడం విడ్డూరంగా ఉందని మండి పడ్డారు.
నిపుణులు ఎవ్వరో : కావేరి అభివృద్ధి మండలి ఏర్పాటుకు సంబంధించి సుప్రీం కోర్టు వచ్చిన గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉన్నది. దీంతో ఆ మండలిలో నిపుణులుగా రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు ఎవ్వరెవ్వరు ఉంటారో అన్న ఎదురు చూపులు పెరిగాయి. కరుణానిధి స్పందిస్తూ, త్వరితగతిన అభివృద్ధి మండలి ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
సమ్మె సైరన్!
Published Sun, Oct 2 2016 2:25 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
Advertisement