అక్రమ రవాణాకు అడ్డా ! | smuggling tochildrens in beguluru to exports | Sakshi
Sakshi News home page

అక్రమ రవాణాకు అడ్డా !

Published Wed, Feb 10 2016 3:02 AM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM

అక్రమ రవాణాకు అడ్డా !

అక్రమ రవాణాకు అడ్డా !

బెంగళూరు:  ఐటీ నగరిగా పేరుగడించిన బెంగళూరు నేడు నేర నగరిగా మారిపోతోంది. మునుపటి ప్రశాంతత కోల్పోతోంది. నగరం నేరగాళ్లకు అడ్డాగా మారుతోంది. సోమవారం అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాల జాడలు రాష్ట్రంలో బహిర్గతమవుతుండటంతో నగర ప్రజల్లో కలవరం మొదలైంది. ముఖ్యంగా చిన్నారులను అక్రమ మార్గంలో అమెరికాకు చేరవేసేందుకు ముఠాల సభ్యులు పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇలా అమెరికాకు ఎగుమతి చేస్తున్న 16 మంది సభ్యులు గల ముఠాను సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో ఈ ముఠాసభ్యులు పిల్లలను అమెరికాకు తీసుకువెళ్లే క్రమంలో అనుసరిస్తున్న దారులు విస్మయానికి గురిచేస్తున్నాయి. 

నకిలీ ధ్రువపత్రాలే కాదు.. నకిలీ తల్లిదండ్రులు కూడా....
 బెంగళూరుకు చెందిన ఉదయ్‌ప్రతాప్ సింగ్ విదేశాల్లో సంతానం లేనివారితో పాటు అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాలకు పిల్లలను ఎగుమతి చేసేవాడు. ఇందు కోసం ముగ్గురు మహిళలతో సహా పదహారు మందితో ప్రత్యేక ముఠాగా ఏర్పడ్డాడు. వీరిలో కొంతమంది రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన హైదరాబాద్ కర్ణాటక జిల్లాల్లోని నిరుపేదల నుంచి నాలుగు నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలను కొంత డబ్బు ఇచ్చి కొనుగోలు చేసి బెంగళూరుకు తీసుకొచ్చేవారు. అటుపై ఆ పిల్లలకు తన బృందంలోని సభ్యులనే నకిలీ తల్లిదండ్రులుగా ఏర్పాటు చేసేవాడు. అదేవిధంగా నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు, వీసాలు, పాస్‌పోర్టులు చేయించి పిల్లలను, నకిలీ తల్లిదండ్రుల ద్వారా అమెరికాకు టూరిస్ట్ వీసాల ద్వారా పంపించేవారు. ఈ నకిలీ తల్లిదండ్రులు అమెరికాకు చేరుకునే సమయానికి అంతకు ముందుగానే డీల్ కుదుర్చుకున్న సంతానం లేని దంపతులు ఎయిర్‌పోర్టులో వేచి ఉంటారు. ఆ సమయంలో పిల్లలను సదరు దంపతులకు అప్పగించి కొన్ని వారాల పాటు అక్కడే ఉండి నకిలీ దంపతులు వెనక్కి వచ్చేస్తారు. టూరిస్ట్ వీసా ద్వారా అమెరికాకు వెళుతుండటంతో ఈ దంపతులపై పెద్దగా అనుమానం కూడా వచ్చేది కాదు. మరోవైపు ఇలా బెంగళూరు నుంచి అమెరికాకు చేరుకున్న పిల్లలు ప్రస్తుతం ఎక్కడున్నారన్న విషయాన్ని ముఠాసభ్యులు చెప్పలేకపోతున్నారు. దీంతో సంతానంలేని దంపతులకు పిల్లలను అందజేసే నెపంతో అమెరికాలోని చిన్నపిల్లల స్మగ్లింగ్ గ్యాంగులకు ఉదయ్ ప్రతాప్ సింగ్ ముఠాసభ్యులు సహకరిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

 అనుమానం ఇలా మొదలైంది!
 బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చిన్నారులతో టూరిస్ట్ వీసాపై అమెరికా వెళ్లిన కొంతమంది దంపతులు వారం లోపే తిరిగి బెంగళూరుకు చేరుకున్నారు. అయితే తిరిగి వచ్చే సమయంలో వారి వద్ద చిన్నారులు ఉండటం లేదని నిఘా వర్గాలు గుర్తించాయి. అంతేకాకుండా బెంగళూరుకు చేరుకున్న తర్వాత నిందితులు అమెరికా వెళ్లే సమయంలో అధికారులకు అందజేసిన వివిధ ధ్రువీకరణ పత్రాల్లో పేర్కొన్న చిరునామాలో ఉండటం లేదని  కూడా అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (ఎస్‌ఐటీ) ఏర్పాటు చేసి దాదాపు ఏడాది పాటు నిందితుల కార్యకలాపాలపై నిఘా ఉంచారు. పక్కా ఆధారాలతో బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో పోలీసుల బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించి ఈ ముఠాను అరెస్ట్ చేసింది.
 
 ఎక్కువగా ఈ ప్రాంతాల నుంచే..
...
 ఈ ముఠాలు ఎక్కువగా గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్‌తో పాటు కర్ణాటకలోని వెనకబడిన ప్రాంతం హైదరాబాద్-కర్ణాటక నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో చిన్నారులను అక్రమంగా తీసుకొచ్చే వారని తెలుస్తోంది. పేదరికంలో ఉంటూ ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలను గుర్తించి వారి నుంచి పిల్లలను కొనుగోలు చేయడం, ఆ తర్వాత వారిని అమెరికాలో అమ్మేయడం వీరి ప్రధాన కార్యకలాపాలుగా పోలీసులు భావిస్తున్నారు. ఇక ఇలాంటి ముఠాలు నగరంలో ఇంకా ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement