షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్‌వాసుల ఇలవేల్పు అయిన శ్రీ సిద్ధరామేశ్వర్ కల్యాణోత్సం పట్టణంలో సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం బాలివెస్‌లోని హీరెహబ్బు మఠం నుంచి ఊరేగింపుగా బయలు దేరిన నందికోలులు సిద్ధేశ్వర ఆలయం వద్ద ఉన్న సమ్మతి కట్ట వద్దకు చేరుకున్నాయి. ఇక్కడ గంగా పూజ, సుగడి పూజ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సమయంలో హెలికాప్టర్ నుంచి కురిసిన పూలవర్షంతో భక్తులు పులకించిపోయారు. ఈ సమయంలో ‘ఓం నమోః శివాయః’ ‘శ్రీ సిద్ధరామేశ్వర్ మహారాజ్‌కీ జై’ అనే నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
ఆలయం వరకు కొనసాగిన ఊరేగింపు సమీప గ్రామాల ప్రజలతోపాటు షోలాపూర్ వాసులతో కన్నులపండువగా సాగింది. ఈ కల్యాణోత్సవంలో కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్ కుమార్ షిండే సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి క్రమం తప్పకుండా స్వామివారి కల్యాణోత్సవానికి హాజరవుతున్నానని చెప్పారు. స్వామివారి ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. ఈ జాతరలో పాల్గొనడం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోందని, ప్రజలందరికీ సుఖశాంతులు ప్రసాదించాలని ఆ సిద్ధేశ్వరుణ్ని ప్రార్థించానన్నారు. పట్టణం మరింత అభివృద్ధి చెంది త్వరలోనే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.
విస్తృత ఏర్పాట్లు...
నందికోలుల ఊరేగింపు కోసం పట్టణ పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పట్టణంలోని నగల వ్యాపారులు, శివసేన పట్టణ కన్వీనర్ ప్రతాప్ చవాన్ భక్తులకు వాటర్ ప్యాకిట్లు, ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రణతి షిండే, ఎమ్మెల్యే విజయ్ దేశ్‌ముఖ్, మేయర్ ఆల్కా రాథోడ్, ఎస్‌ఎంసీ కమిషనర్ చంద్రకాంత్ , ఎమ్మెల్యే దిలీప్ మానేలతో పట్టణంలోని వివిధ పార్టీల పదాధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
68 శివలింగాలకు తైలాభిషేకం
ఆదివారం శ్రీ సిద్ధరామేశ్వర్ పట్టణవ్యాప్తంగా స్వయంగా ప్రతిష్టించిన 68 లింగాలకు తైలాభిషేకం చేశారు. ఈ తైలాభిషేకంలో పాల్గొనేందుకు తెల్లని దుస్తులు ధరించిన సిద్ధేశ్వరుడి భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు రాత్రి 10 గంటల వరకు సాగిందని శ్రీ సిద్ధరామేశ్వర్ దేవస్థానం కమిటీ చైర్మన్ ధర్మారాజు కాడాది తెలిపారు.
ఓం నమఃశివాయః
Published Mon, Jan 13 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement
Advertisement