
తల్లిని కడతేర్చిన తనయుడు
వేలూరు: మద్యం తాగేందుకు నగదు ఇవ్వకపోవడంతో తల్లి తలపై రాయి వేసి హత్య చేసిన తనయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు...కేవి కుప్పం సమీపంలోని మచ్చానూర్ కొల్లమేడు ప్రాంతానికి చెందిన అమృదం(70). ఈమెకు సుబ్రమణి అనే కుమారుడున్నాడు. సుబ్రమణికి వివాహం జరిగి ఒక కుమారుడున్నాడు. ఈ నేపథ్యంలో సుబ్రమణి పనికి వెళ్లకుండా తరచూ మద్యం సేవించేవాడు. దీంతో ఇతని భార్య విరక్తి చెంది చిన్నారితో సహా పుట్టింటికి వెళ్లింది. సుబ్రమణి తల్లితో నివసిస్తున్నాడు.
సుబ్రమణి మద్యం సేవించేందుకు నగదు ఇవ్వమని తరచూ తల్లితో ఘర్షణ పడేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన సుబ్రమణి మద్యం సేవించేందుకు తల్లి వద్ద నగదును అడిగాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో ఇంటి సమీపంలో ఉన్న పెద్ద రాయిని తల్లి తలపై వేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అమృదం అక్కడికక్కడే మృతి చెందింది.
సుబ్రమణి వెంటనే అక్కడినుంచి పరారయ్యాడు. ఇంటి సమీపంలో మృతి చెంది ఉన్న అమృదంను మంగళవారం ఉదయం స్థానికులు గమనించి కేవీ కుప్పం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పరారీలో ఉన్న సుబ్రమణిని అదుపులోకి తీసుకొని విచారణ జరపగా మద్యం తాగేందుకు నగదు ఇవ్వకపోవడంతోనే తల్లిని హత్య చేసినట్టు నేరం అంగీకరించాడు.