దక్షిణ రైల్వే భేష్!
చెన్నై, సాక్షి ప్రతినిధి : తమిళనాడు ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న రాయపురం రైల్వేస్టేషన్ అభివృద్ధిపై సర్వేసాగుతోందని రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే చెన్నైలో మూడో స్టేషన్‌గా అందుబాటులోకి వస్తుందని హామీ ఇచ్చారు. కొత్తగా ప్రవేశపెట్టిన చెన్నై సెంట్రల్ - విశాఖపట్టణం వారాంతపు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను మంత్రి ఆదివారం ప్రారంభించారు. అలాగే చెన్నై సెంట్రల్- కామాఖ్య ప్రీమియం ఎక్స్‌ప్రెస్ రైలును త్వరలో ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు. రాయపురం స్టేషన్‌కే కాదు ఏ అభివృద్ధి పనులకైనా బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా మంజూరు చేసేందుకు సిద్ధమని తెలిపారు. అయితే రైల్వే పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమన్నారు.
ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం తమకు ఎంతో సహకరిస్తోందని తెలిపారు. బేసిన్‌బ్రిడ్జ్-సెంట్రల్ మధ్య అదనపు రైల్వేట్రాక్ పనులు ప్రారంభించామని, బీచ్‌స్టేషన్, తిరువళ్లూరు, వేలాచ్చేరీల్లో సైతం ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు ఫ్లాట్‌ఫారం మంజూరు చేశామని తెలిపారు. భారతీయ రైల్వేలోనే దక్షిణ రైల్వే పనితీరు భేషుగ్గా ఉందని కితాబిచ్చారు. సాధారణ ప్రయాణికులు ఎంతో ఇష్టపడే రైల్వే సేవలను దేశవ్యాప్తంగా రోజుకు 2.75 కోట్ల మంది అందుకుంటున్నారని చెప్పా రు. నగరాలకు సాధారణ రైళ్లతోపా టూ శివారు ప్రాంతాలకు సబర్బన్ రైళ్ల సేవలు ఎంతో ప్రయోజనకారిగా ఉన్నాయని చెప్పారు. రైల్వేకు ప్రయాణికులే ప్రాణమని, రైల్వేకు మూడొం తుల ఆదాయం కార్గో నుంచే లభిస్తోందని చెప్పారు. మహిళా ప్రయాణికుల రక్షణకు మహిళాగార్డులను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర నౌకాయాన శాఖా మంత్రి పొన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, విశాఖ నుంచి చెన్నైకి వచ్చే ఈరైలును కన్యాకుమారి వరకు పొడిగిస్తే బాగుంటుందని కోరారు. తమిళనాడుకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలపై రైల్వే మంత్రికి తెలియజేశానని చెప్పారు. ఎంపీ రంగరాజన్ మాట్లాడుతూ, చెన్నై-విశాఖ వారాంతపు రైలును రోజువారిరైలుగా మార్చాలని కోరారు. ఎంపీ విజయకుమార్ మాట్లాడుతూ, విద్య, వైద్యం ప్రాధాన్యత కలిగిన చెన్నై నగరానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేవారికి ఈ రైలు ఎంతో సౌకర్యమన్నారు. రైళ్లలో చోరీలు అరికట్టేందుకు భద్రతా చర్యలు చేపట్టాలని, నేరాలు జరిగినపుడు ప్రయాణికులు రైలు నుంచి దిగకుండానే పోలీసులకు ఫిర్యాదు చేసేలా మొబైల్ సేవలను ఏర్పాటు చేయాలని కోరారు.