సాక్షి, చెన్నై : దీపావళి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సుల్ని రోడ్డెక్కించేందుకు రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ కసరత్తులు చేపట్టింది. ఆ శాఖ మంత్రి తంగమణి బుధవారం రవాణా సంస్థ అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది నుంచి పది వేల వరకు బస్సుల్ని నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. చెన్నై నుంచి ఐదు వేలకు పైగా బస్సులు వివిధ ప్రాంతాలకు నడపనున్నారు.
దీపావళిని ఇంటిళ్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవడం జరుగుతోంది. విద్య, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉన్న వాళ్లు, స్థిరపడ్డ వాళ్లు తమ స్వగ్రామాలకు బయలు దేరడం జరుగుతూ వస్తోంది. ప్రధానంగా చెన్నైలో ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లు అధికం. ఇక్కడి నుంచి పండుగ సందర్భంగా దక్షిణాది జిల్లాలు, కొంగుమండలం, డెల్టా జిల్లాల వైపుగా జన సందోహం పెద్ద సంఖ్యలో కదులుతుంటోంది. ఇప్పటికే పండుగ స్పెషల్, సాధారణ రైళ్లు ఫుల్ అయ్యాయి. ఇక, ఆమ్నీ బస్సులు చార్జీల మోత మోగించే పనిలోపడ్డాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బస్సుల్ని నడిపేందుకు సిద్ధమయింది.
ప్రత్యేక రవాణా సౌకర్యాలు: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నేతృత్వంలో చెన్నై నుంచి తిరుచ్చి, మదురై, కోయంబత్తూరు, తిరునల్వేలి, తూత్తుకుడి, తంజావూరు, నాగపట్నం, సేలం, ధర్మపురి , కృష్ణగిరి తదితర ప్రాంతాలకు ప్రతి రోజూ నడిచే బస్సులతో పాటు అదనపు బస్సుల్ని నడిపేందుకు తగ్గ కసరత్తుల్లో అధికార వర్గాలు పడ్డాయి. బుధవారం మధ్యాహ్నం చెన్నైలోని పల్లవన్ హౌస్‌లో రవాణా శాఖ మంత్రి పి.తంగమణి అధికారులతో ప్రత్యేక బస్సులు నడిపే విషయంగా సమీక్షించారు. చెన్నై, మదురై, కోయంబత్తూరు, తిరునల్వేలి, సేలం తదితర ఎనిమిది డివిజన్ల రవాణా సంస్థలోని అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.
గత ఏడాది ఏ మేరకు బస్సుల్ని నడపడం జరిగింది, గత ఏడాది వచ్చిన ఆదాయం, ఈ ఏడాది ఏ మేరకు బస్సుల్ని నడపాలి, ఏయే రూట్లలో అధికంగా ప్రయాణికులు ఉన్నారు.. తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. గత ఏడాది 9098 బస్సుల్ని రాష్ట్ర వ్యాప్తంగా నడపగా, ఈ ఏడాది అదనంగా మరో ఆరు వందల బస్సుల్ని నడిపేందుకు చర్యలు చేపట్టారు. నవంబర్ ఏడో తేదీ నుంచి 11వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు రోడ్డెక్కించనున్నారు. చెన్నై నుంచి ఐదు వేల బస్సుల్ని వివిధ నగరాలకు నడపబోతున్నారు. ఇతర నగరాల నుంచి ఆయా ప్రాంతాలకు మూడు వేల బస్సుల్ని పరుగెత్తించనున్నారు. ఇక, పండుగ ముగిసినానంతరం తిరుగు పయనం నిమిత్తం 14వ తేదీ వరకు ప్రత్యేక బస్సుల్ని నడపనున్నారు.
దీపావళికి..ప్రత్యేక బస్సులు
Published Thu, Oct 29 2015 2:43 AM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM
Advertisement