కమలంలో జోష్
రాష్ట్రంలో తమ బలం పెరుగుతుండడంతో కమలనాథుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మంది కమలం తీర్థం పుచ్చుకున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ సిద్ధమయ్యారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ నిమిత్తం 234 మంది సిబ్బందిని నియమించారు. వీరికి శిక్షణ ఇచ్చి ప్రజల్లోకి పంపించేందుకు నిర్ణయించారు.
- నాలుగున్నర లక్షల మంది చేరిక
- సభ్యత్వ నమోదు వేగవంతం
సాక్షి, చెన్నై: రాష్ర్టంలో అసెంబ్లీ ఎన్నికల ద్వారా తమ సత్తా చాటుకోవడం లక్ష్యంగా కమలనాథులు ఉరకలు పరుగులు తీస్తున్నారు. కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టినానంతరం పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ హవా కొనసాగడంతో రాష్ర్టంలోని కమలనాథులు ఆశల పల్లకిలో ఊగిసలాడుతున్నారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్ర త్యామ్నాయ శక్తిగా తాము అవతరించడం ఖాయం అన్న ధీమాతో ఉన్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టడం లేదా, అధికారాన్ని శాసించే స్థాయికి ఎదగాలన్న కాంక్షతో ముందుకు దూసుకెళ్తున్నారు.
జోష్: సభ్యత్వ నమోదు పర్వానికి గత నెల మొదటి వారంలో శ్రీకారం చుట్టినా, పది రోజుల క్రితం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చెన్నై పర్యటనతో స్పందన పెరిగింది. మోబైల్‌టోల్ ఫ్రీ నంబర్లను అమిత్‌షా ప్రకటించడం, ఈ నంబర్లకు ప్రచారం పెరగడంతో కమలం వైపు చూసే వారిసంఖ్య పెరుగుతోంది. మార్చి నెలా ఖరులోపు 60 లక్షల మందిని చేర్పించే లక్ష్యం గా చేపట్టిన సభ్యత్వ నమోదు పర్వానికి స్పంద న పెరగడం కమలనాథుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తోంది. ఇదే ఉత్సాహంలో ముందుకు సాగి అమిత్‌షా నిర్ణయించిన లక్ష్యాన్ని చేరుకునేందు కు ఉరకలు పరుగులు తీసే పనిలో పడ్డారు.
వేగవంతం: సభ్యత్వ పర్వాన్ని వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణకు నిర్ణయించారు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక నిరంతర సిబ్బం దిని సభ్యత్వ నమోదు ప్రక్రియకు ఎంపిక చేశారు. వీరందరికీ శిక్షణ ఇప్పించే పనిలోపడ్డారు. శుక్రవారం ఉదయం పూందమల్లిలోని ఓ హాల్‌లో ఈ సిబ్బందికి శిక్షణ తరగతులు ఆరంభమయ్యాయి.
బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు, రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, ప్రధాన కార్యదర్శి సంతోష్‌ల నేతృత్వంలో శిక్షణ తరగతులు ఉదయం నుంచి రాత్రి వరకు జరిగాయి. కేంద్రంలో గతంలో వాజ్‌పేయ్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వ సేవలను, పార్టీ పరంగా ప్రజల్ని ఆకర్షించే అస్త్రాలతో ఈ శిక్షణ తరగతులు జరిగాయి.
ఛేదిస్తాం: పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిర్ణయించిన లక్ష్యాన్ని మార్చి నెలాఖరులోపు ఛేదిస్తామని తమిళి సై సౌందరరాజన్ ధీమా వ్యక్తం చేశారు. శిక్షణ తరగతుల్లో భాగంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. అమిత్‌షా చెన్నై పర్యటనతో పార్టీలో ఉత్సాహం రెట్టింపు అయిందన్నారు.
అందరూ కలసి కట్టుగా సభ్యత్వ నమోదును వేగవంతంచేసే పనిలో పడ్డారన్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ నిమిత్తం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. రో జుల వ్యవధిలో నాలుగున్నర లక్షల మంది తమ పార్టీలోకి వచ్చారని, మున్ముందు తమ బలం పెరగనుందని, తామే ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతున్నామని తెలిపారు.