తమిళ జాలర్లను వేటాడిన శ్రీలంక గస్తీ దళాలు
37 మంది అరెస్ట్, ఆరు పడవలు స్వాధీనం
సరిహద్దులు దాటితే సహించేది లేదని శ్రీలంక అధ్యక్షులు సిరిసేన ప్రకటించిన మరుసటి రోజే ఆ దేశ గస్తీదళాలు తమ దాష్టీకాన్ని ప్రదర్శించాయి. నాగపట్నం జిల్లాకు చెందిన 37 మంది జాలర్లను అరెస్ట్ చేసి తమ దేశానికి పట్టుకెళ్లాయి. అలాగే ఆరు మరపడవలను స్వాధీనం చేసుకున్నాయి. దీన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీలంకలోని ఈలం తమిళులతో ప్రారంభమైన వైరం ఆ దేశ మాజీ అధ్యక్షులు రాజపక్స హయాంలో తారాస్థాయికి చేరింది. ఈలంపై యుద్ధం పేరుతో సాగిన దమనకాండ వందలాది మంది తమిళులను పొట్టనపెట్టుకుంది. వేలాది మందిని నిరాశ్రయులను చేసింది. ఎందరో అభాగినులు మాన, ప్రాణాలను కోల్పోయారు. సముద్రంలో చేపలవేట సాగించే తమిళ మత్స్యకారులపై వేధింపులు, సాధింపులు కూడా పెచ్చుమీరిపోయాయి. ఇటీవల శ్రీలంకలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్సే ఓటమి, సిరిసేన గెలుపుతో తమిళులకు మంచిరోజులు వచ్చాయని భావించారు. ఈలంతోపాటూ తమిళ మత్స్యకారుల సమస్య శాశ్వతంగా తొలగిపోతుందని ఆశించారు. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల శ్రీలంక పర్యటన సమయంలో సైతం తమిళ మత్స్యకార కుటుంబాలకు అదే భరోసా కల్పించారు. అయితే ఇదంతా వట్టి భ్రమ అనిపించేలా శ్రీలంక అధ్యక్షులు సిరిసేన తన అభిప్రాయాన్ని ప్రకటించారు. శ్రీలంక సరిహద్దుల్లో చేపలవేట సాగిస్తే అరెస్ట్ చేసి తీరుతాము, అంతేకాదు వారి మరపడవలను స్వాధీనం చేసుకుని తిరిగి అప్పగించబోమని రెండురోజుల క్రితం హెచ్చరించారు.
విరుచుకుపడిన శ్రీలంక సేన: నాగపట్నం జిల్లా అక్కరైపేటకు చెందిన వెయ్యిమంది మత్స్యకారులు 400 మర పడవల్లో ఈనెల 1వ తేదీన సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. వారంతా ఈనెల 5 లేదా 6వ తేదీన తిరిగి నాగైకి చేరాల్సి ఉంది. శుక్రవారం రాత్రి కారైనగర్, నెడుందీవుల వద్ద చేపల వేట సాగిస్తుండగా శ్రీలంక గస్తీదళాలు వారి పడవలను చుట్టుముట్టాయి. గస్తీదళాలను చూడగానే మత్స్యకారులు భయంతో వారి పడవలను నాగైవైపునకు పరుగులు పెట్టించారు. అయినా వదలని దళాలు వారిని వెంబడించాయి. 37 మంది జాలర్లను అరెస్ట్ చేసి వెంట తీసుకెళ్లాయి. అలాగే 6 మరపడవలను స్వాధీనం చేసుకున్నాయి.
ప్రాణభీతితో స్వగ్రామానికి బయలుదేరిన మత్స్యకారులు తమ వద్దనున్న సెల్‌ఫోన్ ద్వారా శ్రీలంక దౌర్జన్యాన్ని తమవారికి చేరవేయడంతో మత్స్యకారుల గ్రామాల్లో ఆందోళన నెలకొంది. సిరిసేన తన అభిప్రాయాన్ని ప్రకటించిన మరుసటి రోజే ఆదేశ దళాలు విరుచుకుపడడం పట్ల రాజకీయ పార్టీలు ఖండిచాయి. ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని డీఎంకే అధినేత కరుణానిధి, తమిళమానిల కాంగ్రెస్ అధ్యక్షులు జీకే వాసన్, పీఎంకే అధినేత రాందాస్ శనివారం వేర్వేరు ప్రకటనల్లో విజ్ఞప్తి చేశారు.
సిరి‘సేన’ దాష్టీకం
Published Sun, Apr 5 2015 3:02 AM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM
Advertisement
Advertisement