సాక్షి, చెన్నై : శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమ సింఘే భారత పర్యటనలో ఉండగానే, ఆ దేశ నౌకాదళం తమిళ జాలర్లపై విరుచుకు పడింది. కచ్చదీవుల సమీపంలో ఓ పడవను ధ్వంసం చేసిన శ్రీలంక సేనలు సముద్రంలో ముంచేశారు. మరి కొన్ని పడవల్లోని వలల్ని నాశనం చేశారు. నీటమునిగిన పడవలో ఉన్న నలుగుర్ని సహచర జాలర్లు రక్షించి ఒడ్డుకు చేర్చారు. శ్రీలంక సేనల వీరంగాన్ని ఖండిస్తూ గురువారం నుంచి రా మేశ్వరం జాలర్లు సమ్మె సైరన్ మో గించారు.
తమిళ జాలర్లకు కడలిలో భద్రత లేదన్న విషయం తెలిసిందే. సరిహద్దులు దాటినా, కచ్చదీవులకు సమీపంలో వేట సాగించినా, శ్రీలంక నౌకాదళం వీరంగానికి గురి కావాల్సిందే. శ్రీలంక సేనల చేతికి చిక్కితే చాలు బందీగా ఆదేశ చెరలో నెలల తరబడి మగ్గాల్సిందే. జాలర్ల సంఘాలు ఏకమై ఉద్యమ బాట పట్టినప్పుడే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం, కొన్ని నెలల అనంతరం మళ్లీ ఇక్కడికి బందీగా వెళ్లిన వాళ్లు తిరుగు పయనం కావడం పరిపాటే. ఈ పరిస్థితుల్లో ఈనెల నాలుగో తేదీ నుంచి శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘే భారత్‌లో పర్యటిస్తున్నారు.
ఆయన భారత పర్యటనను పురస్కరించుకుని ఆ దేశ చెరలో పదుల సంఖ్యలో ఉన్న తమిళ జాలర్లను ఆ దేశ ప్రభుత్వం విడుదల చేసింది. దినదిన గండంతో కడలిలోకి వెళ్తున్న జాలర్లు, రనిల్ రాకతోనైనా తమ మీద దాడులకు తగ్గుతాయా..? అందుకు తగ్గ చర్యలు కేంద్రం తీసుకునేనా, ఒత్తిడి పెంచేనా అన్న ఎదురుచూపుల్లో జాలర్లు నిమగ్నం అయ్యారు. అయితే, రనిల్ భారత్‌లో ఉండగానే శ్రీలంక సేనలు విరుచుకు పడి తమ ప్రతాపం చూపించి వెళ్లడాన్ని తమిళ జా లర్లు జీర్ణించుకోలేకున్నారు. ఈ దాడితో జాలర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
మళ్లీ దాడి : రామేశ్వరానికి చెందిన జాలర్లు బుధవారం రాత్రి వేట నిమిత్తం కడలిలోకి వెళ్లారు. ఐదు వందల మంది జాలర్లు వందకు పైగా పడవల్లో కచ్చదీవుల సమీపంలో వలల్ని విసిరి వేటలో నిమగ్నమయ్యారు. అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో అటు వైపుగా నాలుగు బోట్లలో పదుల సంఖ్యలో శ్రీలంక సేనలు వచ్చి రాగానే విరుచుకుపడ్డారు. కర్రలు, రాళ్లతో తమిళ జాలర్లపై దాడులకు దిగారు. విసిరి ఉన్న వలల్ని తెంచి పడేస్తూ వీరంగం సృష్టించారు. వీరి చేతికి చిక్కితే ఎక్కడ బందీ కావాల్సి వస్తుందో అన్న ఆందోళనలో పడ్డ జాలర్లు ఒడ్డుకు తిరుగు పయనమయ్యారు. అయినా, వదలి పెట్టకుండా వెంటాడిన సేనలు ఆంతోనికి చెందిన ఓ పడవను చుట్టుముట్టి ధ్వంసం చేశారు.
ఆ పడవకు రంధ్రం పెట్టి సముద్రంలో ముంచేశారు. ఆ పడవలో ఉన్న నలుగురు సముద్రంలో ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన సహచర జాలర్లు వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. గురువారం ఉదయాన్నే ఈ దాడి సమాచారంలో జాలర్ల సంఘాల నేతలు రామేశ్వరానికి పరుగులు తీశారు.
సమ్మె సైరన్ : తాజా దాడుల్లో ఓ పడవ మునగడం, లక్షలాది రూపాయల విలువగల వలలు నాశనం కావడంతో జాలర్ల సంఘాల్లో ఆక్రోశం రగిలింది. సమ్మె సైరన్ మోగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అక్కడి మత్స్యశాఖ కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో జాలర్లు, నేతలు నిరసనకు దిగడంతో కాసేపు ఉత్కంఠ నెలకొంది.
జాలర్లు హఠాత్తుగా సమ్మె సైరన్ మోగించడంతో ఎక్కడి పడవలు అక్కడే ఒడ్డుకు పరిమితమయ్యాయి. అలాగే, చేపల్ని కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యాపారులు ఒట్టి చేత్తో వెను దిరగాల్సి వచ్చింది. అలాగే, ఉత్పత్తి చేసిన ఐస్‌గడ్డలను స్టోరేజ్‌లో భద్ర పరచుకోవాల్సిన పరిస్థితి ఆయా యాజమాన్యాలకు ఏర్పడింది. ఈ సమ్మె కారణంగా వ్యాపారులు, చేపల్ని తరలించే వాహనాలకు, ఐస్‌గడ్డల ఉత్పత్తిలో పనిచేస్తున్న కార్మికులు పని లేకుండా పోయింది. ఈ సమ్మె ఎన్ని రోజులు సాగుతుందో అన్న ఆందోళన వారిలో బయలు దేరింది. ఇక, వీరిని బుజ్జగించేందుకు మత్స్యశాఖ అధికారులు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.
మళ్లీ దాడి!
Published Fri, Oct 7 2016 2:31 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
Advertisement
Advertisement