![Sakshi Guest Column On India Sri Lanka Katchatheevu Politics](/styles/webp/s3/article_images/2024/04/11/ranil.jpg.webp?itok=5DyCAAmO)
భారత ప్రధాని మోదీతో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (ఫైల్ ఫొటో)
విశ్లేషణ
తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా కచ్చతీవు వివాదం వార్తల్లో ఉంటుంది. పరిమిత రాజకీయ జీవితకాలం ఉన్న ఈ అంశాన్ని భారత్–శ్రీలంక ద్వైపాక్షిక సమస్యగా పొడిగించాలని కోరుకునేవారు గమనించాల్సింది, నాయకుల మధ్య వ్యక్తిగత సమీకరణాలు విధాన మార్గదర్శ కాలుగా పనిచేశాయి. దానివల్ల వివాదాలు సామరస్యంగా పరిష్కారమయ్యాయి. కాబట్టి గత నిర్ణయాల పట్ల అర్థంలేని వివాదాలు ప్రయోజనం చేకూర్చవు. ఇంకా ముఖ్యంగా, ‘వియన్నా కన్వెన్షన్ ప్రకారం భారతదేశం ఏకపక్షంగా (కచ్చతీవు) ఒప్పందాన్ని రద్దు చేయలేదు. దేశం ఎదుగుతున్న శక్తిగా తనను తాను ప్రకటించుకుంటున్నప్పుడు ఒడంబడిక రద్దు అనేది అంతర్జాతీయ రాజకీయాల్లో తన ప్రతిష్ఠను కోల్పోయేలా చేస్తుంది.’
ఒక వారం క్రితం భారత ఎన్నికల వేదికపై కచ్చతీవు వివాదం విరుచుకుపడినప్పుడు, 1994 జనవరిలో విదేశాంగ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన జేఎన్ దీక్షిత్‌తో మూడు దశాబ్దాల క్రితం గడిపిన సాయంత్రాల వైపు నా మనస్సు మళ్లింది. కొలంబోలో ఉన్న సమయంలో ‘వైస్రాయ్’ నామ కరణం పొందిన దీక్షిత్ 1985 నుండి 1989 వరకు భారత హైకమిషనర్‌గా, ఒక రకంగా మార్గదర్శకుడిగా వ్యవహరించారు. ఆయన సహ చరులు చాలామంది, విదేశీ వ్యవహారాల రహస్యాలను తాము చని పోయేంతవరకు దాచిపెడుతున్న సమయంలో, దౌత్యంపై జాతీయ మీడియాలో రాజకీయ కాలమ్‌ను ప్రారంభించిన మొదటి భారతీయ విదేశాంగ కార్యదర్శి జేఎన్ దీక్షిత్.
నేను దీక్షిత్‌తో గురుగావ్‌లో గడిపాను. శ్రీలంకలో తాను పని చేసిన సంవత్సరాల గురించి ఆయన ఒక పుస్తకం రాయాలను కున్నారు. ఆయన పదవీకాలం భారత్, శ్రీలంక సంబంధాలలో అక్ష రాలా అత్యంత విస్ఫోటనా కాలం. ఇది జనావాసాలు లేని కచ్చతీవు ద్వీపంపై ప్రస్తుత టీకప్పులో తుపాను లాంటిది కాదు.
అవి ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలలో వేగవంతమైన హెచ్చు తగ్గులతో కూడి, శ్రీలంకలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఎదుర్కొంటున్న దురదృష్టకరమైన సంవత్సరాలు. విదేశీ సంబంధాలలో ఇటు వంటి అస్థిరత చివరికి రెండేళ్ల వ్యవధిలోనే భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, అప్పటి శ్రీలంక అధ్యక్షుడు రణసింఘే ప్రేమదాస విషాద హత్యలకు దారితీసింది. దీక్షిత్‌కు జనాల కోసం రాయడం గురించి సందేహాలున్నాయి.
రచయితగా మారే క్రమంలో నాలాంటి చాలామంది జర్నలిస్టులను ఆయన రప్పించుకున్నారు. ‘అసైన్ మెంట్ కొలంబో’ శీర్షికతో శ్రీలంకపై రాస్తున్నానంటూ దీక్షిత్ వెల్లడించిన పుస్తకం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టింది. అధికారిక రహస్యాల చట్టంలోని నిబంధనలలో చిక్కుకోకుండా ఉండేందుకు ఆయన దానిని జ్ఞాపకాల నుండి మాత్రమే రాయాలనుకున్నారు. ఈలోగా, అంతగా వివాదాస్పదం కాని మరో మూడు పుస్తకాలను ప్రచురించారు.
ఒక సాయంత్రం, శ్రీలంక సందర్శనకు విచ్చేసిన ఉన్నత స్థాయి భారతీయ ప్రతినిధి బృందానికి తాను ఏర్పాటు చేసిన రిసెప్షన్ గురించి ఆయన నాకు చెప్పారు. హైకమిషనర్ ప్రత్యేక అతిథిగా ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి సిరిమావో బండారు నాయకే ఆ రిసెప్షన్ కు హాజరయ్యారు. ఆ సమావేశానికి హాజరైన వారి మానసిక స్థితి ఉల్లాసంగా ఉంది.
కొంచెం మత్తులో ఉన్న భారతీయ సందర్శకులలో ఒకరు, సిరిమావో బండారునాయకే అధికారంలో ఉన్నప్పుడు ద్వీపంలో అంతర్యుద్ధం చెలరేగి ఉండినట్లయితే, ఎల్టీటీఈ అగ్రనేత వేలుపిళ్లై ప్రభాకరన్ విషయంలో ఆమె ఏమి చేసి ఉండే వారంటూ చికాకు కలిగించే ప్రశ్నను అడిగారు. ఒక్క క్షణం కూడా సంకోచించకుండా, బండారునాయకే ఇలా తిప్పికొట్టారు: ‘నేను న్యూఢిల్లీలో ఉన్న మా సోదరికి ఫోన్‌చేసి, ఈ ప్రభాకరన్ అనే వ్యక్తినీ, లంక తమిళ సమస్యకు అతని రకమైన పరిష్కారాన్నీ నేను క్రమబద్ధీ కరించేటప్పుడు ఈ అంశంపై దృష్టిసారించకుండా వేరే వైపు చూడ మని అడిగి ఉంటాను.’ ఆ ‘సోదరి’ మరెవరో కాదు, ఇందిరా గాంధీ.
అనూహ్యంగా, శ్రీలంక జాతి కలహాల సమయంలో కొలంబోలో భారతదేశ మొదటి కార్యదర్శిగా ఉన్న నిరుపమారావు ఆ సమయంలో తన ప్రాణాలకు ముప్పు కలిగే స్థితిలో ఉన్నారు. ఏప్రిల్ 1న కచ్చతీవు వివాదం చెలరేగిన కొన్ని గంటల్లోనే తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) అకౌంటులో నిరుపమ వ్యాఖ్యానిస్తూ, తనను 1983లో ఉన్నట్లుండి శ్రీలంక నుండి స్వదేశం పంపించి వేశారని రాశారు.
‘1974 ఒప్పందం ముగింపులో ఇందిరా గాంధీ, సిరిమావో బండారునాయకే మధ్య వ్యక్తిగత సమీకరణం నిర్ణయాత్మక పాత్ర పోషించింది’ అని రాశారు. కచ్చతీవు చర్చల విషయంలో తనను రక్షించాల్సిందిగా ఇందిరకు బండారునాయకే వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశారనీ, లేకుంటే ఆమెకు రాజ కీయంగా విపత్తు తప్పేది కాదనీ నిరుపమ చెప్పారు. దశాబ్దాల తర్వాత పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో దీక్షిత్ దీన్నే చెప్పారు. తరు వాత నిరుపమారావు 2004 నుండి 2006 వరకు కొలంబోలో హై కమిషనర్‌గా పనిచేశారు.
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ పార్థ ఘోష్ ఇలా రాశారు: ‘బండారునాయకే దుఃస్థితిని ఇందిరా గాంధీ స్పష్టంగా గ్రహించారు. భారత ప్రతినిధి బృందం ప్రతిస్పందించకముందే పరిస్థితిని తారుమారు చేశారు. ఇందిర ప్రదర్శించిన ఈ ఔదార్యపు సంకేతాన్ని బండారునాయకే 1990 చివరిలో ఎంతో కృత జ్ఞతతో గుర్తు చేసుకున్నారు.’ ఘోష్ ఆ సంవత్సరాన్ని 2000 అని పేర్కొని ఉండాలి, అంటే బండారునాయకే ప్రధానమంత్రిగా తన చివరి పదవీకాలం పూర్తయ్యే వరకు అన్నమాట. ఒక దశాబ్దం పాటు శ్రీలంక ఏకైక మహిళా అధ్యక్షురాలుగా ఉన్న ఆమె కుమార్తె చంద్రికా కుమారతుంగ కూడా భారత్ 1974లో ప్రదర్శించిన ఈ స్నేహ పూర్వకమైన సంకేతాన్ని మరచిపోలేదు.
కొలంబోలో తనకంటే ముందే పనిచేసిన దీక్షిత్, నిరుపమా రావు కాలం నుండి కచ్చతీవు విషయంలో పెద్దగా మార్పు రాలేదనే వాస్త వాన్ని అమృత్‌సర్ నుండి బీజేపీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి తరణ్‌జిత్ సింగ్ సంధూ కూడా ధృవీకరించగలరు. సం«ధూ 2000 నుండి 2004 వరకు శ్రీలంకలో భారత రాయబార కార్యాలయంలో కౌన్సెలర్‌గానూ, హైకమిషనర్‌గానూ పనిచేశారు.
2017లో సంధు భారత హైకమిషన్ లో బాధ్యతలు స్వీకరించి నప్పుడు, శ్రీలంక బీజింగ్ అందాలకు పడిపోయింది. భారత ప్రభావ పరిధిలో ఉండటం మానేసింది. అధ్యక్షుడిగా మహింద రాజపక్స చైనా అనుకూల విధానాలను కలిగి ఉన్నప్పటికీ, తరణ్‌జీత్ సింగ్ సంధూ, ప్రతిపక్ష నాయకుడిగా రాజపక్సను ఒకసారి కాదు రెండుసార్లు భారత్‌ను సందర్శించేలా చేసే ఆహ్వానం కోసం పట్టుబట్టారు.
ఆ రెండు సార్లలో మొదటి సందర్శన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, మహింద రాజపక్స మధ్య ఏర్పడిన బంధం... శ్రీలంక కీల కమైన రాజకీయవేత్తను భారత మద్దతుదారుగా మార్చింది. రెండేళ్ల తర్వాత, మహింద ప్రధాని అయినప్పుడు, భారత్ లెక్కించినట్లుగానే, ఆయన తొలి బాహ్య సదస్సు మోదీతోనే వర్చువల్‌గా జరిగింది. మహింద సోదరుడు గొటబయ రాజపక్స అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తన మొదటి పర్యటన కోసం భారత్‌నే ఎంచుకున్నారు.
ఏప్రిల్ 19న తమిళనాడులో ఓటింగ్ జరిగేదాకా పరిమిత రాజకీయ జీవితకాలమే ఉన్నప్పటికీ, కచ్చతీవు వివాదాన్ని ద్వైపాక్షిక సమస్యగా పొడిగించాలని కోరుకునే వారందరూ నేర్చుకోవలసిన ఒక పాఠం ఉంది. రాజపక్స కుటుంబం రాజకీయ అరణ్యంలో ఉన్నప్పటికీ భారత్–శ్రీలంక సంబంధాలు ఇప్పుడు అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కంటే మెరుగైన మిత్రుడు భారత్‌కు దొరకరు.
ప్రస్తుత ప్రధాని దినేశ్ గుణవర్దన విషయంలోనూ ఇది నిజం. యూఎస్‌లో తన క్లాస్‌మేట్ అయిన జయ ప్రకాశ్ నారాయణ్ ప్రభావంతో భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నందుకు దినేశ్ తండ్రి ఫిలిప్ గుణవర్దనను బ్రిటిష్‌వాళ్లు బొంబాయిలో బంధించారని కొద్దిమంది భారతీయులకే తెలుసు.
విదేశాంగ కార్యదర్శిగానూ పనిచేసిన నిరుపమారావు ప్రకారం, ‘వియన్నా కన్వెన్షన్ ప్రకారం భారతదేశం ఏకపక్షంగా (కచ్చతీవు) ఒప్పందాన్ని రద్దు చేయలేదు. దేశం ఎదుగుతున్న శక్తిగా తనను తాను ప్రకటించుకుంటున్నప్పుడు ఒడంబడిక రద్దు అనేది అంతర్జాతీయ రాజకీయాల్లో తన ప్రతిష్ఠను కోల్పోయేలా చేస్తుంది.’
కేపీ నాయర్
వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకులు
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment