ఎయిడ్స్ చిత్రంలో శ్రీయారెడ్డి
ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన చిత్రంలో నటి శ్రీయారెడ్డి నటిస్తున్నారు. ఎయిడ్స్ అవగాహన చిత్రం అనగానే ఇదేదో డాక్యుమెంటరీ చిత్రం అని భావించాల్సిన అవసరం లేదు. అలా అని పక్కా కమర్షియల్‌గానూ ఉండదు. ఇది మంచి సందేశంతో కూడిన ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక చిత్రంగా ఉంటుం దని చెప్పవచ్చు. కారణం దీనికి దర్శకుడు ప్రియదర్శన్. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, శ్రీయారెడ్డి ప్రధాన పాత్రలు ధరిస్తున్నారు. దీన్ని ప్రభుదేవా స్టూడియోస్, అమలాపాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న థింక్ బిగ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం.ఈ చిత్రానికి సిల నేరంగళ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ విషయాన్ని నటుడు ప్రకాష్‌రాజ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సిలనేరంగళ్ చిత్ర స్క్రిప్ట్‌ను దర్శకుడు ప్రియదర్శకుడు నెరేట్ చేసినప్పుడే అందులోని డెప్త్ అమేజింగ్ అనిపించింది. కథ చాలా అర్థవంతంగా ఉంది. శ్రీయారెడ్డి పాత్ర హైలెట్‌గా ఉంటుంది. అని ప్రకాష్‌రాజ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అదనపు వివరాలేమిటంటే ఈ చిత్ర షూటింగ్‌ను దర్శక నిర్మాతలు 25 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేశారట. చిత్ర కథ ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుందట. ఎయిడ్స్ గురించి సమాజంలో అవగాహన కలిగించడమే సిలనేరంగళ్ చిత్ర ముఖ్య ఉద్దేశం కావడంతో దీన్ని అంతర్జాతీయ చిత్రోత్సవాలకు లక్ష్యంగా తెరకెక్కిస్తున్నారు. సబుసిరిల్ కళా దర్శకత్వం, సంతోష్ శివన్ చాయాగ్రహణం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.