సాక్షి, చెన్నై : ఎన్నికల కసరత్తుల్లో ఈసీ దూసుకెళ్తోంటే, పొత్తుల మంతనాల్లో రాజకీయ పక్షాలు పరుగులు తీస్తున్నాయి. ఈ సమయంలో డీఎంకే, బీజేపీ మధ్య కొత్త బంధం కుదిరినట్టు ప్రచారం బయలు దేరడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో పొత్తుకు చాన్సే లేదంటూ డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ ఖరాకండిగా తేల్చారు. ఇక అవన్నీ వ్యూహాలేనని బీజేపీ అధ్యక్షురాలు తమిళి సై వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల ద్వారా అధికార పగ్గాలు చేపట్టి తీరాలన్న లక్ష్యంతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి తీవ్ర ప్రయత్నాల్లో మునిగి ఉన్నారు. కాంగ్రెస్, డీఎండీకేలతో కలిసి ఈ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ వ్యూహ రచనలు చేసి ఉన్నారని చెప్పవచ్చు. అయితే, కాంగ్రెస్ సిద్ధమైనా, డీఎండీకే నుంచి బహిరంగంగా ఎలాంటి స్పందన రాలేదు.
ఈ పరిస్థితుల్లో ఇటీవల బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి స్పందిస్తూ, డీఎండీకే, బీజేపీ, డీఎండీకేలతో కూటమి ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇందుకు తగ్గట్టుగానే పరోక్ష వ్యాఖ్యల్లో పలువురు కమలనాథులు నిమగ్నం అయ్యారని చెప్పవచ్చు. ఇందుకు కారణం కమలం వెంట నడిచే పార్టీలు రాష్ట్రంలో లేని దృష్ట్యా, ఇక డీఎంకే నీడన చేరక తప్పదన్న కథనాలు బయలు దేరాయి. అలాగే, బీజేపీ డీఎండీకే, డీఎంకే కూటమి ఆవిర్భవించే పరిస్థితులు ఉన్నట్టుగా ప్రచారం ఊపందుకు కుంది.
అయితే, వీటిని డీఎంకే , బిజేపీ, డీఎండీకే వర్గాలు ఖండించ లేదు. ఈ పరిస్థితుల్లో ఆథ్యాత్మిక గురువు రవి శంకర్ తో డిఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ బుధవారం చెన్నైలో భేటీ కావడం తదుపరి పొత్తు ప్రచారాలకు బలం చేకూరే రీతిలో కథనాలు విస్తృతం అయ్యాయి. బీజేపీ, డీఎంకేల మధ్య కొత్త బంధం కుదిరినట్టుగా పుకార్లు బయలు దేరాయి. ఇది కాస్త కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చినట్టు అయింది. అదే సమయంలో ఇక, బంధం కుదిరినట్టేనని, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాకతో సీట్ల పందేరాలు కొలిక్కి వచ్చినట్టే అన్న ప్రచారం ఊపందుకుంది. ఈ కొత్త ప్రచార రాష్ట్ర వ్యాప్తంగా హల్ చల్‌చేయడంతో దీనికి ముగింపు పలికేందుకు డిఎంకే దళపతి స్టాలిన్ రంగంలోకి దిగారు. నీడ కోసం ఎదురు చూస్తున్న కమలం ఆశల్లో నీళ్లు చల్లే విధంగా స్పందించారు. బీజేపీ తో పొత్తుకు చాన్సే లేదంటూ కరాఖండిగా తేల్చారు.
ఖండించిన స్టాలిన్: డిఎంకే దళపతి స్టాలిన్ మనకు మనమే నినాదంతో చెన్నైలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన్ను మీడియా చుట్టుముట్టింది. కమలంతో పొత్తు కుదిరినట్టుగా వస్తున్న సమాచారాల మీద ప్రశ్నించింది. ఇందుకు స్టాలిన్ కాస్త ఘాటుగానే స్పందించారు.ఎవరు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మీద శఠేర్లు, వ్యంగ్యాస్త్రాలు సందించిన వాళ్లంతూ ఇప్పడు తమ వెంట నడిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. బిజేపితో పొత్తు గురించి ఎలాంటి సమాచారం లేదు అని, అందుకు తగ్గ అవకాశాలు లేదని స్పష్టం చేశారు. అవన్నీ ప్రచారాలు మాత్రమేనని తేల్చారు. రవి శంకర్‌తో తన భేటి వ్యక్తిగతం మాత్రమేని పేర్కొన్నారు. చెన్నైకు వచ్చినప్పుడు కలుస్తానని ఆయన పేర్కొన్న మేరకు ఈ భేటి జరిగిందే గానీ, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు అని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరగనున్న ఆయన కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపు నిచ్చారని, అయితే, ఎన్నికల బిజీలో ఉన్నందున తిరస్కరించినట్టు సూచించారు. డిఎంకే కూటమి పై అధినేత కరుణానిధి ఒకటి రెండు రోజుల్లో కీలక ప్రకటన చేయబోతున్నారని ముగించారు.
అవన్నీ వ్యూహాలు మాత్రమే :
డిఎంకే నీడన చేరాలన్న ఆశ బీజేపీ ఉన్నట్టు సంకేతాలు ఉన్నా, చివరకు అది బెడిసి కొట్టడం కమలానికి ఓ షాక్కే. అయితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మాత్రం కొత్త వివరణ ఇచ్చే పనిలో పడ్డారు. ఇంత వరకు పొత్తు ప్రయత్నాల్లో తాము దిగ లేదని , ప్రస్తుతం వస్తున్న వార్తలు, కథనాలు అన్నీ వ్యూహాలు, ప్రచారాలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల పొత్తు వ్యవహారాలను ఢిల్లీ పెద్దలు చూసుకుంటారని, అధిష్టానం ఆదేశాల మేరకు తమ పయనం అని స్పందించారు. ఇక, రవి శంకర్ , స్టాలిన్‌ల భేటి వారి వ్యక్తిగతం అని, ఇక, సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యలు కూడా ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని పేర్కొన్నారు.
బీజేపీతో పొత్తుకు చాన్సే లేదు
Published Fri, Feb 12 2016 2:06 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement