శశికళను కలవడంపై అభ్యంతరం, స్టాలిన్ లేఖ
చెన్నై: తమిళనాడు ఇన్‌చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు డీఎంకే కోశాధికారి ఎం.కె.స్టాలిన్ గురువారం లేఖ రాశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సులర్లు శశికళను కలవడంపై ఆయన ఆ లేఖలో అభ్యంతరం తెలిపారు. రాజ్యాంగ పదవిలో లేని వ్యక్తిని వీసీలు ఎలా కలుస్తారని స్టాలిన్ లేఖలో ప్రశ్నించారు. విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టకుండా చూడాలని ఆయన ఈ సందర్భంగా గవర్నర్‌ను కోరారు.
కాగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు ఒకేసారి ఖాళీ అయ్యాయి. పెద్దగా తర్జనభర్జన అవసరం లేకుండానే ముఖ్యమంత్రి పదవి పన్నీర్‌సెల్వాన్ని వరించింది. జయ రెండుసార్లు జైలు కెళ్లినపుడు పన్నీర్‌సెల్వంకే సీఎం బాధ్యతలు అప్పగించడంతో ఆమె అభీష్టానికి అనుగుణంగా పన్నీరుకే పట్టం కట్టారు.
అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి జయలలిత నెచ్చెలి శశికళకే అప్పగించేందుకు రంగం కూడా సిద్ధమైంది. ఇందుకు శశికళ సైతం మౌనమే అంగీకారంగా వ్యవహరిస్తున్నారు. అలాగే పన్నీర్‌సెల్వం సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతిరోజూ పోయెస్‌గార్డెన్ కు వెళ్లి చిన్నమ్మ దర్శనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు అధికారులు శశికళను కలవడంపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.