- బీజేపీ రాష్ట్ర నేతలపై మురళీధర్‌రావు మండిపాటు
- ప్రభుత్వ వైఫల్యాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశం
- చెరకు రైతుల సమస్యలపై పాదయాత్రకు సమావేశంలో నిర్ణయం
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ రాష్ట్ర శాఖ నేతలు పూర్తిగా విఫలమయ్యారంటూ ఆ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధర్ రావు పార్టీ రాష్ట్రశాఖ నేతలపై మండిపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం, త్వరలో రానున్న బీబీఎంపీ ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కోవడం తదితర అంశాలపై చర్చించేందుకు గాను బీజేపీ రాష్ట్రశాఖకు చెందిన సీనియర్ నేతలు, పదాధికారులు శుక్రవారమిక్కడ సమావేశమయ్యారు.
ఈ సమావేశానికి పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధర్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ సమావేశంలో మాట్లాడుతూ..... ‘సింగిల్ డిజిట్ లాటరీలో ఏకంగా ఐపీఎస్ స్థాయి అధికారిపై ఆరోపణలు రావడం, మాఫియా దందాలు చెలరేగిపోవడం ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వివాదాలను ఎదుర్కొంటున్నా వీటిని మీరు ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకెళ్లలేకపోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఎందుకు విఫలమవుతున్నా? మీ మౌనమే అధికార పక్షానికి బలంగా మారుతోంది’ అని మురళీధర్‌రావు పార్టీ నేతలపై మండిపడినట్లు తెలుస్తోంది. ఇక ఇదే సందర్భలో ‘ఒక సమర్ధవంతమైన ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ధీటుగా నిలదీయండి’ అని రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
అంతేకాక చెరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఇక ఇదే సందర్భంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు గాను రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలను యోగా కార్యక్రమాలకు రప్పించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అనంతకుమార్, సదానందగౌడ, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి, విధానసభలో ప్రతిపక్ష నేత జగదీష్‌శెట్టర్, పరిషత్‌లో ప్రతిపక్ష నేత కె.ఎస్.ఈశ్వరప్ప, సీనియర్ నేతలు ఆర్.అశోక్, గోవింద కారజోళ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 28న బెళగావిలో పాదయాత్ర......
ఇక చెరకు రైతుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తూ పాదయాత్ర నిర్వహించేందుకు బీజేపీ నేతలు ఈ సమావేశంలో నిర్ణయించారు. బెళగావి జిల్లాలోని అంకలగి నుంచి ఈనెల 28న పాదయాత్ర నిర్వహించనున్నారు. అంకలగి నుంచి బెళగావి నగరంలోని సువర్ణసౌధ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది.
మౌనం వీడండి
Published Sat, Jun 20 2015 5:17 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM
Advertisement
Advertisement