
ఉపశమనం
► కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటు ప్రక్రియపై స్టే
► క్షేత్రస్థాయి పర్యటనకు నిపుణుల బృందం
► కర్ణాటక సర్కార్‌కు స్వల్ప ఊరట
►రోజుకు 2 వేల క్యూసెక్కులు చొప్పున ఈ నెల 7 నుంచి 18 వరకు నీరు విడుదల నీరు చేయాలి
► తదుపరి విచారణ 18కి వాయిదా
►ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు
రోజుకు 2వేల క్యూసెక్కులు...
కర్ణాటక, తమిళనాడుతో పాటు కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రస్తోగీ వాదనలు విన్న ఉదయ్‌లలిత్, దీపక్‌మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం రోజుకు 2వేల క్యూసెక్కుల చొప్పున ఈనెల 7 నుంచి 18 వరకూ తమిళనాడుకు కావేరి నదీ జలాలలను కర్ణాటక విడుదల చేయాలని ఆదేశించింది. నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికను ఈనెల 17న అందజేయాలంది. అంతేకాకుండా కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటుపై స్టే విధిస్తూ తీర్పు చెబుతూ తదుపరి విచారణను ఈనెల 18కు వాయిదా వేసింది.
బెంగళూరు : కావేరి నీటి విడుదలపై సుప్రీంకోర్టులో పలు పర్యాయాలు ఎదురుదెబ్బ తగిలిన కర్ణాటక సర్కార్‌కు మంగళవారం అత్యన్నత న్యాయస్థానంలో స్వల్ప ఊరట లభించింది. కావేరి నదీ జలాల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్నట్లుగానే కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటు ప్రక్రియపై స్టే విధించింది. అదే విధంగా నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక అందజేయాలని సూచించింది. రోజుకు 2వేల క్యూసెక్కుల చొప్పున ఈనెల 7 నుంచి 18 వరకూ తమిళనాడుకు కావేరి నదీ జలాలను కర్ణాటక విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మూడు అంశాలలో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఉపశమనమనే అని చెప్పాలి. వివరాలు... కావేరి నదీ జలాలను తమిళనాడుకు విడుదల చేసే విషయమై సుప్రీంకోర్టులో గత నెల 5 నుంచి పలు దఫాలుగా విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ ప్రారంభం కాగానే కర్ణాటక ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న ఫాలీ నారిమన్ వాదన ప్రారంభిస్తూ... గత నెల 30న సుప్రీం కోర్టు చెప్పినట్లు రోజుకు 6 వేల క్యూసెక్కుల నీటిని ఈనెల ఒకటి నుంచి ఆరు వ రకూ మొత్తం 36 వేల క్యూసెక్కుల విడుదల చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇందులో ఇప్పటి వరకూ కేవలం 12 వేల క్యూసెక్కుల నీటిని వదిలామని, మిగిలిన నీటిని ఆక్టోబర్ 6 లోపు విడుదల చేస్తామని తెలిపారు. ట్రిబ్యునల్ తీర్పుపై కర్ణాటక ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఈనెల 18న సుప్రీంకోర్టు త్రిసభ్య పీఠం ముందుకు రానుందని ఈ సందర్భంగా ధర్మాసనానికి గుర్తుచేశారు.
అందువల్ల కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటు చేయాలని ఈ సమయంలో చెప్పడం సమంజసం కాదన్నారు. ఇదే సందర్భంలో ‘గతంలో మీరు ఒక సారి 15 వేల క్యూసెక్కులు, మరోసారి 12 వేల క్యూసెక్కులు అటుపై 6 వేల క్యూసెక్కుల కావేరి జలాలలను తమిళనాడుకు విడుదల చేయాలని చెప్పారు. మీరు ఏ ప్రతిపాదికన తీర్పు చెప్పారో అర్థం కావడం లేదు.’ అన్నారు. ఈ సమయంలో కలుగజేసుకున్న న్యాయమూర్తులు ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన తీర్పుతో పాటు గణాంకాలను అనుసరించి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇందుకు ప్రతిస్పందించిన నారిమన్ ‘ఆదేశాలు జారీ చేయడానికి గణాంకాల కంటే వాస్తవ పరిస్థితులు ప్రమాణికం’ అన్నది తమ అభిప్రాయమని కోర్టుకు తెలియజేశారు.
ఈ సమయంలో ద్విసభ్య ధర్మాసనం ఈనెల 7 నుంచి 18 వరకూ రోజుకు ఎంత నీటిని విడుదల చేస్తారో కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి కోర్టుకు తెలియజేయాలని సూచిస్తూ వాదనను 3:15 గంటలకు వాయిదా వేసింది. కోర్టు బయట రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎం.బీ పాటిల్‌తో పాటు న్యాయ, నీటిపారుదల రంగ నిపుణులతో చర్చించిన అనంతరం రోజుకు 1,500 క్యూసెక్కుల నీటిని వదలగలమని కోర్టుకు నారిమన్ తెలియజేశారు. ఇదిలా ఉండగా కోర్టులో విచారణ సందర్భంగా కావేరి న దీ పరివాహక రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలో పర్యటించడానికి వీలుగా సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ జీ.ఎస్ ఝ నేతృత్వంలో నిపుణుల కమిటీ అవకాశం కల్పించాలని అటర్నీ జనరల్ ముకుల్ రస్తోగి విన్నవించారు. ఇందులో నాలుగు రాష్ట్రాలకు చెందిన చీఫ్ ఇంజనీర్లతో నీటి పారుదల రంగానికి చెందిన పలువురు నిపుణులు ఉంటారని తెలిపారు. అంతేకాకుండా కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటు సుప్రీం కోర్టు పరిధిలోకి రాదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇక తమిళనాడు తరఫున వాదలను వినిపించిన శేఖర్‌నాబ్డే ఎప్పటిలాగానే కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటుకు పట్టుబట్టారు.
సుప్రీం తీర్పుపై ఎవరు ఏమన్నారంటే...
ఒకే మాటపై నిలబడినందుకే
కావేరి విషయంలో అన్ని పార్టీలు ఒకే మాటపై నిలబడినందుకే మనకు ఊరట లభించింది. ఇదే సందర్భంలో ప్రధాని నరేంద్రమోదీ, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడతో పాటు కేంద్ర మంత్రులందరికీ ధన్యవాదాలు చెబుతున్నా. నదిలో రోజుకు 2వేల ఔట్‌ఫ్లో ఉండటం సాధారణం అందువల్ల మనం ఎక్కువ విడుదల చేసే అవసరమే రాదనుకుంటున్నా. - ట్విట్టర్‌లో సీఎం సిద్ధు
అంత నీరు ఉందోలేదో?
సుప్రీం కోర్టు తీర్పు కొంత ఊరట లభించింది. అయితే రోజుకు 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి మన వద్ద ఆమేరకు నీటి లభ్యత ఉందోలేదో. - కావేరి హిత రక్షణ సమితి అధ్యక్షుడు మాదేగౌడ
అనివార్యం
కావేరి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఈనెల 18న సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. అందువల్ల ప్రస్తుతం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కచ్చితంగా పాటించాల్సిందే. అయితే మండలి ఏర్పాటుపై స్టే, రోజుకు 2వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వాదలాలన్నది ఊరట ఇచ్చే విషయం. - జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ