కూంబింగ్ ఆపండి | Stop kumbing | Sakshi
Sakshi News home page

కూంబింగ్ ఆపండి

Published Tue, Nov 19 2013 3:20 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

Stop kumbing

= మావోయిస్టుల హెచ్చరిక
 = అటవీ శాఖ చెక్‌పోస్టుపై దాడి
 = సిబ్బంది సురక్షితం
 = కార్యాలయం ధ్వంసం
 = గాలిలోకి కాల్పులు

 
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : మలెనాడులో మావోయిస్టులు మళ్లీ ఉనికి చాటుకున్నారు. చిక్కమగళూరు జిల్లా శృంగేరి తాలూకా తనికోడు గ్రామంలోని అటవీ శాఖ చెక్‌పోస్టుపై సోమవారం వేకువ జామున దాడి చేశారు. చెక్‌పోస్టులో ఇద్దరు సిబ్బంది ఉన్నప్పటికీ, వారికి ఎలాంటి హాని తలపెట్ట లేదు. అక్కడున్న సీసీ కెమెరాలు, వైర్‌లైస్ సెట్లు, టెలిఫోన్ ఫర్నీచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. రసీదు పుస్తకాలను చేతబట్టుకుని వెళుతూ వెళుతూ గాలిలో కాల్పులు జరిపారు. నలుగురితో కూడిన బృందం అకస్మాత్తుగా ప్రవేశించిందని అక్కడి ఉద్యోగి నాగరాజ్ తెలిపారు. బయట మరో ఇద్దరు నిలుచుని ఉన్నారని చెప్పారు.

తక్షణమే కూంబింగ్‌ను నిలిపి వేయాలని వారు డిమాండ్ చేశారని తెలిపారు. కుద్రేముఖ్ జాతీయ ఉద్యాన వనంలో నివాసం ఉంటున్న గిరిజనులను ఖాళీ చేయించరాదని కూడా పేర్కొంటూ అక్కడ పోస్టర్లను అంటించడంతో పాటు కరపత్రాలను వెదజల్లి నిష్ర్కమించారు. ఈ సంఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడారు. మళ్లీ మావోయిస్టుల సంచారం ప్రారంభం కావడంతో ఆందోళన చెందుతున్నారు.

విషయం తెలిసిన వెంటనే ఎస్‌పీ అభిషేక్ గోయెల్ హుటాహుటిన తన సిబ్బందితో అక్కడికి వెళ్లారు. శృంగేరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని చెక్‌పోస్టులతో పాటు పొరుగున ఉన్న శివమొగ్గ, ఉడిపి జిల్లాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహనాల తనిఖీని ప్రారంభించారు. కూంబింగ్‌ను తీవ్రతరం చేశారు. పది రోజుల కిందట మావోయిస్టులు దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా నారావి గ్రామ పంచాయతీ సభ్యుడు రామచంద్ర భట్ ఇంటికి నిప్పు పెట్టారు.
 
అప్పట్లో ఎనిమిది నుంచి పది మంది మావోయిస్టులు దాడి జరిపారు. పోలీసులకు సమాచారం ఇస్తానని అతను చెప్పడంతో ఆగ్రహించి ఇంటి ముందు నిలిపి ఉన్న వ్యాను, బైక్‌లకు నిప్పు పెట్టి పారిపోయారు.  కొన్నేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు మళ్లీ పంజా విప్పారు. దీంతో కోస్తా, మలెనాడు ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement