పార్టీ పటిష్టతే లక్ష్యంగా
నేటి నుంచి బెంగళూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
గురువారం మధ్యాహ్నం నగరానికి చేరుకోనున్న ప్రధాని మోదీ
మూడు రోజుల పాటు సమావేశాలు
బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేయడంతో పాటు అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను బెంగళూరులో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను బీజేపీ రాష్ట్రశాఖ శ్రేణులు పూర్తి చేశాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న మొట్టమొదటి జాతీయ కార్యవర్గ సమావేశాలు కావడంతో ఈ సమావేశాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంలో ఉద్యాననగరి మొత్తం కాషాయమయంగా మారిపోయింది. గురువారం ఉదయం నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాలు మూడు రోజుల పాటు(శనివారం వరకు) కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, పదాధికారులు పాల్గొననున్నారు. నగరంలో మూడు రోజుల పాటు జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించిన వివరాలను బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
కర్ణాటకతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని మరింత పటిష్టం చేయడమే ఈ సమావేశాల్లో ముఖ్య చర్చాంశం కానుందని ప్రహ్లాద్ జోషి తెలిపారు. సమావేశాల ఏర్పాట్లను కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్.అశోక్ నేతృత్వంలో రూపొందించిన 33 కమిటీలు పర్యవేక్షించనున్నాయని పేర్కొన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర శాఖ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధర్ రావు మాట్లాడుతూ...మే 27 నాటికి కేంద్రంలో బీజేపీ అధికారాన్ని చేపట్టి ఏడాది పూర్తవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు చెప్పారు. అంతేకాక పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై సైతం ఇదే సమావేశాల్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు వెల్లడించారు. మూడు రోజుల పాటు నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల వివరాలు
2వ తేదీ: గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం రాత్రి 8గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, అన్ని రాష్ట్రశాఖల అధ్యక్షులు, పదాధికారులు పాల్గొంటారు. గురువారం మద్యాహ్నం 2.30గంటలకు నగరానికి చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం 4గంటల నుంచి 8 గంటల వరకు ఈ సమావేశంలో పాల్గొని సభ్యులందరితో చర్చిస్తారు.
3వ తేదీ : శుక్రవారం ఉదయం 10 గంటలకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఫ్లోర్ లీడర్లతో పాటు మొత్తం 330 మంది ప్రతినిధులు పాల్గొంటారు.
ఇక ఇదే రోజు సాయంత్రం 5గంటలకు నగరంలోని నేషనల్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సమావేశంలో ప్రధానమంత్రి మోదీ పాల్గొని ప్రసంగిస్తారు . 4వ తేదీ : శనివారం ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు కార్యవర్గ సమావేశం కొనసాగుతుంది. సమావేశాల ముగింపు కార్యక్రమం అనంతరం 3గంటలకు ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఇదే రోజు సాయంత్రం 6గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీ వెళతారు.
ఇక దక్షిణం
Published Thu, Apr 2 2015 1:32 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement