సాక్షి, చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని కాట్టాన్‌కులత్తూర్ ఎస్‌ఆర్‌ఎం కళాశాలలో మంగళవారం సాయంత్రం రెండు వర్గాల విద్యార్థులు ఘర్షణపడ్డారు. కత్తులు, తుపాకీతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. కాలేజ్ హాస్టల్స్‌లో బస చేస్తున్న విద్యార్థుల మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఎంబీఏ రెండో ఏడాది చదివే విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి వీది రౌడీల్లా ప్రవర్తించారు. క్యాంపస్‌లో భయానక వాతావరణం సృష్టించారు. ఒక వర్గం విద్యార్థుల చేతిలో తుపాకీ కనిపించగా.. మరో వర్గం చేతిలో వేట కొడవలి కనిపించింది. దీంతో మిగతా విద్యార్థులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘర్షణలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని సమీపంలోని ప్రైవేటు ఆప్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కాలేజ్‌కు వెళ్లి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థుల చేతిలోకి మరణాయుధాలు ఎలా వచ్చాయనేదానిపై కూడా పోలీసులు విచారణ సాగిస్తున్నారు. కొందరు విద్యార్థులు ఈ గొడవను తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతేడాది ఇదే కళాశాలకు చెందిన ముఖేష్ అనే విద్యార్థిని వండలూర్ సమీపంలో అతని స్నేహితుడు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment