కటాఫ్ కలవరం
- ఇంజినీరింగ్‌కు గట్టి పోటీ
- ఎంబీబీఎస్‌కు కాస్త ఉపశమనం
- దరఖాస్తుల కోసం పరుగులు
సాక్షి, చెన్నై: ప్లస్‌టూ ఫలితాల విడుదలతో విద్యార్థుల దృష్టి ఉన్నత చదువుల మీద పడ్డాయి. అన్నావర్సిటీ నేతృత్వంలో జరిగే కౌన్సెలింగ్‌కు కటాఫ్ మార్కులు ఏ మేరకు ఉంటాయోనన్న కలవరం బయలుదేరింది. ఇందుకు కారణం ఈ సారి ఇంజినీరింగ్‌లో ప్రధాన సీట్లకు గట్టి పోటీ ఉండడమే. ఇక, ఎంబీబీఎస్ విషయానికి వస్తే కటాఫ్ మార్కులు కాస్త తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని విద్యా విధానం మేరకు ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలబడుతూ వస్తున్నది.
ప్లస్‌టూ ముగించిన విద్యార్థులు ఇంజినీరింగ్, వైద్య కోర్సుల్లో ప్రవేశ నిమిత్తం ఎలాంటి ప్రవేశ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. ప్లస్‌టూలో సాధించిన మార్కుల ఆధారంగా ఇంజినీరింగ్, వైద్య కోర్సుల సీట్లను విద్యార్థులకు కేటాయిస్తున్నారు. ప్రధానంగా గణితం, బయాలజీ, ఫజిక్స్, కెమిస్ట్రీల్లో సాధించిన మార్కుల ఆధారంగా కటాఫ్ నిర్ణయించి సీట్లను అప్పగిస్తున్నారు.
కటాఫ్ కలవరం : రాష్ట్రంలో ప్రభుత్వ, స్వయం ప్రతిపత్తి హోదా కల్గిన 575 వరకు ఇంజినీరింగ్ కళాశాలు ఉన్నాయి. వీటిల్లో కళాశాలను బట్టి 50 నుంచి 65 శాతం మేరకు సీట్లను అన్నా వర్సిటీ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయడం జరుగుతున్నది. ఈ ఏడాది ప్లస్‌టూలో ఉత్తీర్ణత శాతం పెరగడంతో కటాఫ్ మార్కులు ఏ మేరకు నిర్ణయిస్తారోనన్న కలవరం విద్యార్థుల్లో బయలు దేరింది. ప్రభుత్వం భర్తీ చేయనున్న సీట్లకు కోసం ఎలాంటి డొనేషన్లు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన అతి తక్కువ ఫీజుల్నే కళాశాలలు వసూళ్లు చేయాల్సి ఉంటుంది కాబట్టి విద్యార్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకునే పనిలో పడ్డారు.
అయితే, కటాఫ్ కలవరం విద్యార్థుల్ని వెంటాడుతున్నది. బీఈ, బీటెక్‌లలోని ప్రధాన కోర్సుల్ని చేజిక్కించుకోవాలంటే, రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించే కటాఫ్ మార్కుల మీద ఆధార పడిఉంది. ఈ ఏడాది గణితంలో మునుపెన్నడూ లేని రీతిలో 200కుగాను రెండు వందల మార్కులను 9,700 మంది, 198 మార్కులను పదిహేను వేల మంది వరకు చేజిక్కించుకుని ఉండడంతో ఇక, ప్రధాన సీట్లకు గట్టి పోటీ తప్పదన్నది స్పష్టం అవుతోన్నది. దీంతో ఈ ఏడాది కటాఫ్ మార్కు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది కటాఫ్ మార్కు రెండు వందలకు గాను 199.75 వరకు నిర్ణయించే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంటుండడంతో ఈ ఏడాది ఇంజినీరింగ్‌లో ప్రధాన సీట్లకు భలే గిరాకీ తథ్యం.
ఎంబీబీఎస్: ఇక, ఎంబీబీఎస్ విషయానికి వస్తే కటాఫ్‌మార్కు మరింతగా తగ్గే అవకాశం ఉంది. ఇందుకు కారణం గత ఏడాది బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో విద్యార్థులు రికార్డులు సృష్టిస్తే, ఈ ఏడాది చతికిలబడడమే. గత ఏడాది ఈ సబ్జెక్టుల్లో రెండు వందలకు రెండు వందల మార్కులను పెద్ద సంఖ్యలో సాధించగా , ఈ సారి కేవలం ఐదుగురు మాత్రమే నిలిచారు. దీంతో ఎంబీబీఎస్ కటాఫ్ మార్కు ఈ సారి తగ్గే అవకాశాలు ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.రెండు వందలకు 199.25 వరకు ఈ సారి కటాఫ్ నిర్ణయించ వచ్చన్న సంకేతాలతో ఇంజినీరింగ్‌లో ప్రధాన సీట్లను ఆశిస్తున్న విద్యార్థులు, ప్రత్యామ్నాయంగా ఎంబీబీఎస్ దరఖాస్తులను సైతం కొనుగోలు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పరుగులు తీస్తున్నారు.