ఎంజీ వర్సిటీలో విద్యార్థుల ఆందోళన
Published Fri, Apr 21 2017 12:49 PM | Last Updated on Fri, Nov 9 2018 4:46 PM
నల్గొండ: పరీక్షల విభాగం సిబ్బంది నిర్లక్ష్యంతో తమకు సెమిస్టర్ పరీక్షలో సున్న మార్కులు వచ్చాయని, తమ జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరీక్షల విభాగం సిబ్బందిని తప్పించాలని డిమాండ్ చేస్తూ ఎంజీ వర్సిటీలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. తమ విన్నపాన్ని పట్టించుకోని వీసీ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ 20 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కళాశాల భవనంపైకి ఎక్కారు. దీంతో వర్సిటీ ప్రాంగణంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఫలితాలలో పాస్ అని చూపిస్తూ మెమోల్లో ఫెయిల్ అయినట్లు ఉంటోందని వారు వాపోతున్నారు. దీనిపై హెచ్‌ఓడిని కలిస్తే 50 మార్కుల వరకు వచ్చాయని చెబుతున్నారని, మెమోల్లో తప్పినట్లు చూపుతున్నారని, వీసీని కలిస్తే తనకు సంబంధం లేదని పట్టించుకోవడంలేదని విద్యార్థులు చెప్పారు. పరీక్షల విభాగం అధికారులు, సిబ్బందిని తప్పించి తమకు న్యాయం చేయాలని వారు వారం రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు.
Advertisement