నగరవాసులకు వచ్చే నెల ఒకటో తేదీనుంచి విద్యుత్ కోత సమస్యతలెత్తే ప్రమాదం పొంచివుంది. ఇందుకు కారణం ఈ నెలాఖరులోగా ఎన్టీపీసీకి బకాయిలు చెల్లించాలని బీఎస్‌ఈఎస్ కంపెనీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఆలోగా చెల్లించనట్లయితే ఎన్‌టీపీసీ... బీఎస్‌ఈఎస్‌లకు జారీ చేసిన నోటీసుపై విధించిన స్టేను ఎత్తివేస్తామని హెచ్చరించింది.
సాక్షి, న్యూఢిల్లీ:ఈ నెల 31వ తేదీలోగా ఎన్‌టీపీసీకి బకాయిలను చెల్లించాలని బీఎస్‌ఈఎస్ కంపెనీలను సుప్రీం కోర్టు ఆదేశించింది. అప్పటిదాకా విద్యుత్ సరఫరా యథాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. జస్టిస్ సురీందర్‌సింగ్ నిజ్జార్, జస్టిస్ ఎ.కె.సిక్రి ల నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఒకవేళ ఆ లోగా చెల్లించనట్లయితే ఎన్‌టీపీసీ... బీఎస్‌ఈఎస్‌కు జారీ చేసిన నోటీసుపై విధించిన స్టేను ఎత్తివేస్తామని హెచ్చరించింది. ఒకవేళ ఇదే కనుక జరిగితే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నగరవాసులకు కరెంటు కష్టాలు తప్పవు. కాగా విద్యుత్ కొనుగోలు తాలూకు బకాయిలు చెల్లించాలంటూ కోర్టు ఆదేశించినప్పటికీ బీఎస్‌ఈఎస్ రాజధాని, బీఎస్‌ఈఎస్ యమునా పవర్ కంపెనీలు పట్టించుకోవడం లేదని, అందువల్ల ఢిల్లీకి విద్యుత్ సరఫరాలో కోత విధింపునకు అనుమతించాలని ఎన్‌టీపీసీ గత గురువారం సుప్రీంకోర్టును కోరింది. రిలయన్స్ అనుబంధ బీఎస్‌ఈఎస్ సంస్థ తనకు రూ. 800 కోట్ల మేర బకాయి చెల్లించాల్సి ఉందని ఎన్‌టీపీసీ తన పిటిషన్‌లో పేర్కొంది.
బకాయిలు చెల్లించనట్లయితే బీఎస్‌ఈఎస్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తానని ఎన్‌టీపీసీ గతంలో నోటీ సు జారీ చేసింది. అయితే సుప్రీం కోర్టు సదరు నోటీసుపై స్టే విధిస్తూ, బకాయిలు చెల్లించాల్సిందిగా ఒకవైపు బీఎస్‌ఈఎస్‌ను, ఢిల్లీకి విద్యుత్ సరఫరాను కొనసాగించాలని మరోవైపు ఎన్‌టీపీసీని ఆదేశించింది. ఇందుకు సంబంధించి మార్చి నెల 26వ తేదీన కోర్టు జారీ చేసిన ఆదేశాలను బీఎస్‌ఈఎస్ ఎంతమాత్రం ఖాతరు చేయడం లేదని, తనకు బకాయిలు చెల్లించడం లేదని ఎన్‌టీపీసీ న్యాయస్థానానికి తెలియజేసింది. మరో విద్యుత్ పంపిణీ సంస్థ టాటా పవర్ ఢిల్లీ డి స్ట్రిబ్యూషన్ లిమిటెడ్ పైసా బకాయి లేకుండా తన బిల్లులను చెల్లిస్తున్నప్పటికీ బీఎస్‌ఈఎస్ క ంపెనీలు మాత్రం బకాయిలు చెల్లించడం లేదని ఎన్‌టీపీసీ పేర్కొంది. బీఎస్‌ఈఎస్ కంపెనీలు చెల్లించే డబ్బులో 75 శాతాన్ని తాము కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెల్లించాల్సి ఉంటుందని ఎన్‌టీపీసీ తెలియజేసింది. కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి తాము విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంటామని, బీఎస్‌ఈఎస్ కంపెనీలు చెలింపులు జరపనున్నట్లయితే బదర్‌పుర్‌లోని తమ థర్మల్ ప్లాంట్ ఢిల్లీకి విద్యుత్తు సరఫరా చేయలేదని ఎన్‌టీపీసీ స్పష్టం చేసింది.
ఢిల్లీకి తాము సరఫరా చేసే విద్యుత్‌లో కోత విధించాలనుకుంటున్నామని పేర్కొంది. అందువల్ల ఢిల్లీకి నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశిస్తూ జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వును ఎత్తివేయాలని ఎన్‌టీపీసీ తరఫు న్యాయవాది కె.కె. వేణుగోపాల్ సుప్రీంకోర్టును కోరారు. ఢిల్లీ ప్రభుత్వం తమకు బకాయిలు చెల్లించడం లేదని, ఈ కారణంగా తమ ఆదాయం తగ్గిపోయిందంది. బకాయిల చెల్లింపు కోసం తమకు సబ్సిడీ ఇవ్వాలని లేదా విద్యుత్ చార్జీలను పెంచాలని బీఎస్‌ఈఎస్ అంటోంది.
‘గ్యాస్ కోసం కేంద్రానికి విన్నవిస్తాం’
న్యూఢిల్లీ: బవానా ప్లాంట్‌కు గ్యాస్ సరఫరా కోసం ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.శ్రీవాస్తవ వెల్లడించారు. త్వరలో పెట్రోలియం శాఖ మంత్రిని కలిసి తగినంత గ్యాస్‌ను సరఫరా చేయాల్సిందిగా కోరతామన్నారు. 2013వ సంవత్సరం నుంచి రిలయన్స్ సంస్థ కేజీ బేసిన్ నుంచి గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. కాగా 1,500 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ఢిల్లీ ప్రభుత్వం 2012లో నిర్మించింది. అయితే గ్యాస్ తగినంత సరఫరా కాకపోవడంతో ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో 350 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. వాయవ్య ఢిల్లీలోని ఈ ప్లాంట్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.శ్రీవాస్తవ ఇటీవల సందర్శించారు. ఉత్తర భారత్‌లో అతి పెద్ద గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రమిదే. ఇందులో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. అందులో నాలుగు గ్యాస్ యూనిట్లు కాగా మిగతావి ఆవిరి ఆధారిత యూనిట్లు. ఈ ప్లాంట్ నిర్మాణానికి దాదాపు రూ. 4,500 కోట్ల వ్యయమైంది.
కోత ముప్పు..?
Published Tue, May 6 2014 10:12 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement