ప్రతీకాత్మక చిత్రం
భువనేశ్వర్ : విద్యా బోధన, పరీక్షల నిర్వహణలో నిరంతరం సంస్కరణలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తుంది. రాష్ట్ర విద్యార్థుల్ని మేధావంతులుగా ఆవిష్కరించి జాతీయ స్థాయి పోటీ, ప్రవేశ పరీక్షల్లో ఉన్నత ఫలితాల్ని సాధించేలా చేయడం ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. తాజాగా పరీక్ష కేంద్రాల్లో పారదర్శకత పట్ల దృష్టి సారించింది. కాపీలు ఇతరేతర అక్రమాలకు చెక్ పెట్టేందుకు తాజా నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల్ని ఏర్పాటు చేస్తారు. హై స్కూల్ సర్టిఫికెటు(హెచ్‌ఎస్‌సి), +2 శ్రేణి ఆర్ట్సు, సైన్సు, కామర్సు విభాగాల వార్షిక పరీక్షా కేంద్రాల్లో ఈ మేరకు ఏర్పాటు చేసేందుకు లాంచనంగా నిర్ణయించారు. 2018–19 విద్యా సంవత్సరం నుంచి తాజా విధానం అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభమయింది.
బోర్డుల ఆధ్వర్యంలో
రాష్ట్ర పాఠశాలలు–సామూహిక విద్యా విభాగం నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల్ని ఏర్పాటు చేస్తారు. ఈ ఏర్పాట్లను అనుబంధ నిర్వాహక సంస్థలు చేస్తాయని విభాగం కార్యదర్శి ప్రదీప్త మహాపాత్రో మంగళవారం తెలిపారు. రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు(బీఎస్‌ఈ), ఉన్నత మాధ్యమిక విద్యా మండలి(సీహెచ్‌ఎస్‌ఈ) వర్గాలకు ఆదేశాల్ని జారీ చేసినట్టు ఆయన వివరించారు. ఈ సంస్థలు ఖరారు చేసిన పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల్ని ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేసినట్టు తెలిపారు.
మాల్ ప్రాక్టీసు నివారణ
పరీక్షా కేంద్రాల్లో మాల్ ప్రాక్టీసు నివారణకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేంద్రాల్లో పరీక్షల నిర్వహణలోపారదర్శకత చోటు చేసుకుని విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల్ని కాపీ రహిత కేంద్రాలుగా ప్రకటించడమే ధ్యేయంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు యోచన కార్యాచరణలో పెడుతున్నట్టు కార్యదర్శి వివరించారు. విభాగం ఆదేశాల మేరకు రాష్ట్ర మాధ్యమిక విద్యా బోర్డు(బీఎస్ ఈ), ఉన్నత మాధ్యమిక విద్యా మండలి(సీహెచ్‌ఎస్‌ఈ) రాష్ట్రవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనివార్యంగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment