భరోసా
Published Sat, Feb 1 2014 11:37 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
తాము అధికారంలోకి వస్తామని, దాడులకు ముగింపు పలుకుతామని జాలర్లకు బీజేపీ పార్లమెంటరీ నేత సుష్మాస్వరాజ్ భరోసా ఇచ్చారు. ఆందోళన వీడాలని, శాశ్వత పరిష్కారంతో జాలర్ల జీవితాల్లో వెలుగు నింపుతామని హామీ ఇచ్చారు.
సాక్షి, చెన్నై: బీజేపీ జాలర్ల విభాగం నేతృత్వంలో రామేశ్వరంలో శనివారం కడల్ తామరై(సముద్రంలో కమలం) నినాదంతో సభ జరిగింది. ఇందులో బీజేపీ పార్లమెంటరీ నేత సుష్మాస్వరాజ్ పాల్గొని ప్రసంగించారు. శ్రీలంక నావికాదళం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, పైశాచికత్వం ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మోడీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడటం తథ్యమని, తద్వారా జాలర్ల జీవితాల్లో వెలుగును నింపుతామన్నారు. తమిళ జాలర్లకు శ్రీలంకతో, గుజరాత్ జాలర్లు పాక్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. జాలర్లపై జరుగుతున్న దాడులకు ఒకే ఒక పరిష్కార మార్గం కేంద్రంలో ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయడం ద్వారానే సాధ్యమన్నారు. ఇందుకు మోడీ అంగీకరించారని, అధికార పగ్గాలు చేపట్టాక, జాలర్ల కోసం ప్రత్యేక శాఖ ఏర్పడటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
దాడులకు తాత్కాలిక పరిష్కారం కాదని, శాశ్వత పరిష్కారం చూపించి తీరుతామని భరోసా ఇచ్చారు. తమ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర జాలర్లపై, తమిళుల సమస్యలపై రాష్ట్ర పార్టీ పలు అంశాల్ని పేర్కొంటుందని, తద్వారా తాము అధికారంలోకి వస్తే, అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దాడులపై మహిళా జాలర్లు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని, దీన్నిబట్టి చూస్తే ఇక్కడి జాలర్లకు ఏ మేరకు న్యాయం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. జాలర్ల సమస్యలు పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వాల వల్ల కాదని, ఒక్క కేంద్రం ద్వారానే సాధ్యమని పేర్కొన్నారు.
ఈ దృష్ట్యా, జాలర్లందరూ తమకు అండగా ఉండాలని, లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక శాతం బీజేపీ, మిత్ర పక్షాల ప్రతినిధుల్ని రాష్ట్రం నుంచి పార్లమెంట్‌కు పంపించాలని పిలుపునిచ్చారు. మోడీ వస్తున్నారని ఆయన జాలర్లకు, తమిళ ప్రజలకు అండగా నిలబడే విధంగా హామీ ఇస్తారని చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో బీజేపీ జాతీయ నాయకుడు ఇలగణేశన్ మాట్లాడుతూ, ఎనిమిదో తేదీన మోడీ తన ప్రసంగం ద్వారా పొత్తుల వివరాల్ని వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, జాతీయ కార్యదర్శి మురళీ ధర్ రావు, మహిళా నాయకులు వానతీ శ్రీనివాసన్, తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement