అమ్మ దర్శనం దక్కేనా?
వాసన్‌కు మళ్లీ షాక్
రెండు రోజుల్లో నిర్ణయం
మళ్లీ మారిన అన్నా డీఎంకే అభ్యర్థులు
సాక్షి, చెన్నై : తమిళ మానిల కాం గ్రెస్ నేత జీకే వాసన్‌కు ఇక, అమ్మ దర్శనం దక్కేనా..? అన్న ప్రశ్న బయలు దేరింది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు గురువారం తామాకాలో చోటు చేసుకున్నాయి. రెండు రోజుల్లో కొత్త నిర్ణయాన్ని ప్రకటిం చేందుకు వాసన్ సిద్ధమవుతున్నారు. ఇక, అన్నాడీఎంకేలో మళ్లీ అభ్యర్థులు మా రారు. తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ నిర్ణయాలను నిర్భయంగా తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలోని అన్ని పార్టీలు పొత్తు పదిలంతో సీట్ల పందేరాలు ముగించుకుని అభ్యర్థుల ఎంపిక కసరత్తుల్లో ఉన్నాయి. అయితే, వాసన్ ఇంత వరకు పొత్తు వ్యవహారాన్ని తేల్చలేదు. అన్నాడీఎంకేతో కలసి ఎన్నికల్ని ఎదుర్కోవాలన్న తపన వాసన్‌లో ఉండడం ఈ జాప్యానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అయితే, అన్నాడీఎంకే ముందు ముప్పైకు పైగా సీట్లను ఉంచి వాసన్ చిక్కుల్లో పడ్డారు.
అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ఇచ్చే సీట్లతో సర్దుకోవాల్సిన పరిస్థితి ఆ కూటమిలో ఉన్నది. అయితే, వాసన్ మెట్టు దిగకపోవడం, నాన్చుడు ధోరణి అనుసరించడంతో అమ్మ జయలలిత కన్నెర్ర చేశారు. అభ్యర్థుల జాబితాను ప్రకటించేశారు. ఇది కాస్త వాసన్‌కు ముచ్చెమటలు పట్టించాయి. ఎట్టకేలకు వాసన్‌కు ఆహ్వానం రావడంతో అన్నాడీఎంకే సీట్ల పందేరం కమిటీతో బుధవారం కుస్తీలు పట్టారు. పది నుంచి పదిహేనులోపు సీట్లకు ఆ కమిటీ అంగీకరించిన సమాచారంతో తమిళ మానిల కాంగ్రెస్ వర్గాల్లో ఆనందం తాండవం చేసింది.
గురువారం పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కేందుకు వాసన్ సిద్ధం అయ్యారని వ్యాఖ్యలు గుప్పించారు. అయితే, ఆనందం ఆవిరి అయ్యాయని చెప్పవచ్చు. ఇందుకు తగ్గ పరిణామాలు తాజాగా చోటు చేసుకుని ఉన్నాయి. పోయెస్ గార్డెన్ నుంచి వచ్చిన ఎనిమిది సీట్లకు పరిమితం, రెండాకుల చిహ్నం మీదే పోటీ చేయాలన్న సూచనతో మళ్లీ వాసన్ ఢీలా పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఉదయాన్నే పోయెస్ గార్డెన్‌కు వాసన్ వెళ్లాల్సి ఉన్నా, అక్కడి నుంచి వచ్చిన సమాచారంతో తదుపరి కార్యచరణ మీద పార్టీ వర్గాలతో కుస్తీలు పట్టే పనిలో పడ్డారు.
అదే సమయంలో పొత్తు తేలుతుందన్న ఆశతో పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ వర్గాలు, మద్దతు దారులకు నిరాశే మిగిలినట్టు అయింది. అలాగే, వాసన్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలతో ఇక, తమకు అమ్మ దర్శనం కరువైనట్టే అన్నట్టుగా పరోక్ష సంకేతాలు ఇవ్వడం గమనార్హం. రెండుకాల చిహ్నం మీద బరిలోకి దిగే ప్రసక్తే లేదన్నట్టుగా పరోక్షంగా తన పార్టీ భవిష్యత్తు దృష్ట్యా, ఎవరికీ అనుకూలంగా నిర్ణయం ఉండదని, ఒకటి రెండు రోజుల్లో పొత్తుపై నిర్ణయాన్ని ప్రకటించేస్తానని వ్యాఖ్యానించడం గమనార్హం.
మళ్లీ మారిన అభ్యర్థులు :
అన్నాడీఎంకేలో మళ్లీ అభ్యర్థులు మారారు. ఏ ముహూర్థాన అభ్యర్థుల జాబితాను జయలలిత ప్రకటించారో ఏమోగానీ, ఆయా నియోజక వర్గాల నుంచి వ్యతిరేకత పలువురు అభ్యర్థుల మీద బయలు దేరి ఉన్నాయి. ఆయా అభ్యర్థులకు వ్యతిరేకంగా నిరసనలు సాగుతున్నాయి. అలాగే, గురువారం కూడా పోయెస్ గార్డెన్‌లో ఈరోడ్ జిల్లా అభ్యర్థులకు వ్యతిరేకంగా ఆత్మాహుతి యత్నాలకు పలువురు కార్యకర్తలు ఒడిగట్టారు.
దీంతో అభ్యర్థుల మార్పు పర్వం మరింత వేగవంతం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే సమయంలో తాజాగా మరో ఇద్దరు అభ్యర్థులను మారుస్తూ జయలలిత నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు పెన్నాగరం బరిలో ఉన్న వేలుమణిని తొలగించి కేపీ మునస్వామికి సీటు అప్పగించారు. అలాగే, వేపన్న హల్లి బరిలో ఉన్న కేపీ మునస్వామి పెన్నాగరంకు మారడంతో ఆ స్థానం బరిలో ఏవి మధు అలియాస్ హేమనాథన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు.