వారణాసికి జర్మన్‌ మహిళ | Tamil Nadu: German tourist raped near Mahabalipuram while asleep | Sakshi
Sakshi News home page

వారణాసికి జర్మన్‌ మహిళ

Published Thu, Apr 6 2017 1:40 AM | Last Updated on Sat, Jul 28 2018 8:44 PM

వారణాసికి జర్మన్‌ మహిళ - Sakshi

వారణాసికి జర్మన్‌ మహిళ

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచ దేశాలను చుట్టి వచ్చేందుకు జర్మనీ నుంచి చెన్నైకి వచ్చిన మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని తలచుకుంటూ తల్లడిల్లిపోయింది. దుండగుల బారినపడి అత్యాచారానికి గురైన స్థితిలో ఇక చెన్నైలో ఉండలేనని బాధాతప్త హృదయంతో వారణాసి బయలుదేరి వెళ్లిపోయింది. భారత్‌లో విదేశీ పర్యాటకానికే మచ్చతెచ్చేలా చోటు చేసుకున్న అత్యాచార సంఘటన తమిళనాడు పోలీసులకు సవాల్‌గా మారింది. జర్మనీ మహిళకు చేదు అనుభవంతో పర్యాటక కేంద్రమైన మహాబలిపురం సందర్శకులు లేక వెలవెలబోతోంది. వివరాలు ఇలా ఉన్నాయి.             
             
జర్మనీ దేశానికి చెందిన జోస్టినా(38) అనే మహిళ సుమారు 15 మంది విదేశీ పర్యాటకులతో కలిసి గత నెల 26వ తేదీన  మహాబలిపురానికి చేరుకున్నారు. అక్కడికి సమీపంలోని పట్టిపులం బీచ్‌ ఒడ్డున సన్‌బాత్‌లో ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు మహాబలిపురంలోనే మకాం వేసి నాలుగు ప్రత్యేక బృందాల ద్వారా నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు.

 జర్మనీ మహిళ ఇచ్చిన పోలికలతో ప్రధాన నిందితుని ఊహాచిత్రం సిద్ధం చేశారు. నిందితుల ఆచూకీ కోసం బీచ్‌లోని దుకాణదారులను, జాలర్లను విచారించారు. ఈనెల 3వ తేదీన పోలీసులు ఐదు వాహనాల్లో మహాబలిపురం, పుదూర్, యారైయూర్‌కుప్పం, దేవనేరి, సూలోరికాడు, నెమ్మేలి, పుదు నమ్మేలి, పుదియకల్‌పాక్కంలోని తొమ్మిది మత్స్యకార గ్రామాలకు వెళ్లారు.

ఆయా గ్రామాల నుంచి 600 మందికి పైగా యువకులను వేర్వేరుగా నిలబెట్టి ఫొటోలు తీశారు.  సంఘటన జరిగిన రోజున అక్కడికి సమీపంలోని ఒక లగ్జరీ అతిథిగృహంలో మందు, విందు జరిగినట్లు తెలుసుకున్నారు. ఈ విందుకు హాజరైన వ్యక్తుల్లో నిందితులు ఉన్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మంగళవారం వరకు జరిగిన విచారణ సందర్భంగా 36 మంది యువకులను జర్మన్‌ మహిళ ముందు హాజరుపరిచారు. 600 ఫొటోలను చూపారు. అయితే వీరిలో నిందితులు లేరని ఆమె పోలీసులకు చెప్పారు.

ఇక ఉండలేను : బాధిత మహిళ
ఎంతో ఉత్సాహంగా చెన్నైకి వచ్చిన నేను చేదు అనుభవంతో ఇక మహాబలిపురంలో ఉండలేనని బాధిత మహిళ పోలీసుల ముందు వాపోయారు. ఇక్కడి జ్ఞాపకాలకు దూరంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి వెళుతున్నట్లు చెప్పి మంగళవారం సాయంత్రం మహాబలిపురంలోని కాటేజ్‌ను ఖాళీ చేశారు. నిందితులను గుర్తించేందుకు మరికొంత కాలం తమకు అందుబాటులో ఉండాలని, బాధితురాలు లేకుంటే కేసు ముందుకు సాగదని పోలీసులు ఆమెను బతిమాలినా కన్నీళ్లుపెట్టుకుంటూ తిరస్కరించారు.

సుమారు 15 మంది విదేశీయులతో ఎంతో సరదాగా మహాబలిపురం చేరుకున్న జోస్టినా పోలీసు విచారణలతో చివరకు ఒంటరిగా మిగిలారు. ఆ తరువాత దయనీయమైన స్థితిలో ఒంటరిగా మహాబలిపురాన్ని వీడి వారణాసికి వెళ్లిపోయారు. జర్మనీ మహిళపై జరిగిన అత్యాచారం సంఘటనతో హతాశురాలైన విదేశీ పర్యాటకులు హడావుడిగా మహాబలిపురంలోని కాటేజీలు, లాడ్జీలను ఖాళీ చేసి వెళ్లిపోయారు. స్వదేశీ, విదేశీ పర్యాటకులతో కళకళలాడుతుండే మహాబలిపురం బోసిపోయింది.

పోలీసులకు సవాల్‌: అత్యాచార సంఘటన జరిగి మూడు రోజులు దాటినా నిందితుల ఆచూకీ  తెలియకపోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. మహాబలిపురం మహిళా పోలీస్‌లు మరో నలుగురు అనుమానితులను పట్టుకుని వారణాసి వెళ్లేందుకు మంగళవారం సాయంత్రం ఎయిర్‌పోర్టులో ఉన్న జర్మన్‌ మహిళ ముందు ప్రవేశపెట్టారు. అయితే వారు కూడా కాదని ఆమె చెప్పడంతో ఆ నలుగురిని విడిచిపెట్టారు. పోలీసుల చిట్టాలో ఉన్న పాత నేరస్తులెవరూ ఆత్యాచారానికి పాల్పడలేదని తేలియడంతో కొత్త నిందితులపై దృష్టిపెట్టారు.

సంఘటన జరిగిన రోజు, అంతకు ముందురోజు మహాబలిపురం లాడ్జీలు, అతిథిగృహాలు, కాటేజీల్లో ఎవరున్నారో తెలుసుకునేందుకు సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నారు. బుధ, గురువారాల్లో నిందితులు పట్టుబడకుంటే ప్రత్యేక పోలీసు దళాలను రంగంలోకి దించాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement