దీపావళి బోనస్
సాక్షి, చెన్నై: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పథకాల అమలు, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో ఉద్యోగ, సిబ్బంది పాత్ర కీలకమన్న విషయం తెలిసిందే. వీరికి దీపావళిని పురస్కరించుకుని ప్రభుత్వం ప్రతి ఏటా బోనస్ ఇస్తోంది. గత వారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏను పెంచుతూ ఆదేశాలిచ్చారు. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న శ్రమజీవులకు దీపావళి బోనస్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం సమీక్ష: రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలైన విద్యుత్ బోర్డు, రవాణా, రబ్బర్ కార్పొరేషన్, అటవీ ఉద్యానవన బోర్డు, తమిళనాడు గృహ నిర్మాణ సంస్థ, నీటి పారుదల బోర్డు, సహకార చక్కెర పరిశ్రమ, పాల ఉత్పత్తి సంస్థ, సహకార సంఘాలు తదితర సంస్థల్లోని కార్మికులకు బోనస్ విషయంగా ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఇందులో మంత్రులు నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ఎడపాడి పళనిస్వామి, విజయభాస్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్ సుంకత్, సలహాదారు షీలా బాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. ఏఏ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ఎంత శాతం బోనస్ ఇవ్వాలన్న విషయంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు దీపావళి కానుకగా బోనస్‌ను ప్రకటిస్తూ ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు 20 శాతం బోనస్ ప్రకటించారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న కార్మికులకు పది శాతం, లాభాల్లో ఉన్న సహకార సంఘాల్లోని కార్మికులకు 20 శాతం బోనస్ నిర్ణయించారు. గృహ నిర్మాణ సంస్థ, వాటర్ బోర్డులో పనిచేస్తున్న సిబ్బందికి పది శాతంగా నిర్ణయించారు. విద్యుత్ తదితర సంస్థల్లో పనిచేస్తున్న ఒప్పంద, తాత్కాలిక కార్మికులు, జిల్లా సహకార సంఘాల్లో పనిచేస్తున్న కార్మికులు, ప్రాథమిక సహకార సంస్థల్లో పనిచేస్తున్న వారికి రూ.1500 నుంచి రూ.రెండు వేల వరకు బోనస్ ప్రకటించారు. ఈ బోనస్‌ను మొత్తం మూడు లక్షల మందికి వర్తింప చేశారు. రూ.221.75 కోట్లు బోనస్‌గా కార్మికులకు అందిస్తున్నామని వివరించారు.