తొలిరోజే వాకౌట్ | Tamil Nadu govt curtails house session | Sakshi
Sakshi News home page

తొలిరోజే వాకౌట్

Published Fri, Dec 5 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

తొలిరోజే వాకౌట్

తొలిరోజే వాకౌట్

 చెన్నై, సాక్షి ప్రతినిధి:శీతాకాల అసెంబ్లీ సమావేశాలు గురువారం వాడివేడిగా ప్రారంభమయ్యూయి. అధికారపార్టీపై ప్రతిపక్షాలన్నీ ఏకమై దాడికి దిగాయి. అయితే అధికార పార్టీ పట్టించుకోకపోవడంతో విపక్షాలు వాకౌట్ చేశాయి. జయలలిత సీటు మాత్రం ఖాళీగా దర్శనమివ్వడం విశేషం. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ముఖ్యమంత్రి పదవిని కోల్పోయూక పన్నీర్ సెల్వం సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా జరుగుతున్న సమావేశాలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన ప్రజాప్రతినిధులకు సంతాపం ప్రకటించి మూడు నిమిషాలు మౌనం పాటించారు. 10.03 గంటలకు ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమై 11.31 గంటలకు ముగిసింది. అసెంబ్లీ సమావేశాలను కేవలం మూడురోజులే నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చే స్తున్న ప్రతిపక్షాలు అసెంబ్లీలోనూ అదే అంశాన్ని లేవనెత్తాయి.
 
 అనేక ప్రజాసమస్యలపై చర్చించాల్సి ఉన్నందున సమావేశాలను పొడిగించాలంటూ డీఎంకే, డీఎండీకే, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ సభ్యులంతా నినాదాలు చేశారు. అన్ని విషయాలు చర్చించడానికి అనుమతిస్తాను, కూర్చోండి అంటూ స్పీకర్ ధనపాల్ కోరినా ప్రతిపక్షాలు పట్టించుకోలేదు. సమావేశాలు పొడిగిస్తున్నట్లు ప్రకటిస్తేనే గానీ కూర్చునేది లేదని పట్టుపట్టాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పోటాపోటీగా వాగ్యుదాధలు చోటుచేసుకోగా చివరకు ప్రతిపక్షాలు సభనుంచి వాకౌట్ చేశాయి. డీఎంకే శాసనసభాపక్ష నేత స్టాలిన్ అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం సమావేశాలను కనీసం ఐదురోజులు నిర్వహించాల్సి ఉంది, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకపోయిందన్నారు. సమావేశాల రోజులు పెంచాలన్న డిమాండ్‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్యానికే చేటు అని  వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యల చర్చించేందుకు తావులేని అసెంబ్లీ సమావేశాల్లో కూర్చోవడం దేనికని వాకౌట్ చేసినట్లు వివరించారు.
 
 జయ సీటు ఖాళీ
  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పన్నీర్ సెల్వం సచివాలయంలో తన పాత హోదానే కొనసాగిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. సీఎంగా జయ కూర్చున్న చాంబర్‌వైపు ఆయన కన్నెత్తి కూడా చూడడం లేదు. ఈ కారణంగా అసెంబ్లీ సమావేశాల్లో పన్నీర్‌సెల్వం ఎక్కడ కూర్చుంటారనే అంశం చర్చనీయాంశమైంది. రెవెన్యూ మంత్రిగా అసెంబ్లీలో ఎక్కడ కూర్చునేవారో అదే కుర్చీలో సీఎం పన్నీర్ సెల్వం ఆశీనులవడంతో చర్చనీయూంశమైంది. దీంతో జయ కూర్చునే కుర్చీ ఖాళీగానే దర్శనమిచ్చింది.
 
 నేను రావడం ఇష్టం లేదు: కరుణ
  డీఎంకే అధినేత కరుణానిధి అసెంబ్లీ సమావేశాల్లో కూర్చోకున్నా సచివాలయానికి వచ్చి సభ్యత్వాన్ని కాపాడుకునేందుకు రిజిష్టరులో సంతకం చేస్తుంటారు. యథాప్రకారం గురువారం కూడా వచ్చి వెనుదిరుగుతుండగా మీడియా ప్రతినిధులు ఆయన్ను చుట్టుముట్టి ‘సమావేశాల్లో పాల్గొనడం లేదా’ అని ప్రశ్నించారు. ఇందుకు ఆయన బదులిస్తూ, రాష్ట్రంలో సాగుతున్న అస్తవ్యస్థ పాలనపై తాను చేసిన విమర్శలకు సీఎం పన్నీర్ సెల్వం స్పందించడం సంతోషమన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకండి, ఆ విమర్శలకు సమాధానాలు చెబుతానని సీఎం సవాల్ చేశారని చెప్పారు.
 
 సీఎం సవాల్‌ను స్వీకరించిన తాను సమావేశాల్లో పాల్గొనాలనే వచ్చాను, 26 ప్రశ్నలకు సిద్ధం చేసుకున్నానన్నారు. అయితే తీరా వచ్చాక చూస్తే అసెంబ్లీ హాలులో తనకు కుర్చీవసతి లేదన్నారు. కురువృద్దుడినైన తనకు ప్రత్యేక వసతులతో కూడిన కుర్చీని అసెంబ్లీ హాలులో సిద్ధం చేయాలని కోరినా పట్టించుకోలేద ని, అందుకే తిరిగి వెళ్లిపోతున్నానన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చిందేకు ఎన్నో అంశాలున్నాయని వచ్చానని అన్నారు. 50 ఏళ్లుగా ఎన్నికల్లో పోటీచేస్తూ ఒక్కసారి కూడా ఓడకుండా ఎమ్మెల్యేగా గెలిచానని, రాష్ట్రంపై పూర్తి అవగాహన ఉందన్నారు. అందుకే సమావేశాల్లో పాల్గొనడం అధికార పార్టీకి ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు.  
 
 విజయకాంత్ డుమ్మా : కుమారుని సినిమా షూటింగ్ నిమిత్తం కొంతకాలంగా విదేశాల్లో ఉన్న డీఎండీకే అధినేత విజయకాంత్ బుధవారం రాత్రి చెన్నై చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు కాబట్టే హడావుడిగా చెన్నైకి వచ్చేశారని అందరూ భావించారు. అయితే విజయకాంత్ సమావేశాలకు హాజరుకాకుండా డుమ్మాకొట్టారు. కాంగ్రెస్‌కు ఐదుగురు సభ్యులుండగా, వారిలో ముగ్గురు కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ ప్రతిపక్ష నేతలుగా వాకౌట్ చేశారు. అయితే కాంగ్రెస్‌ను వీడి సొంతపార్టీ పెట్టుకున్న జీకేవాసన్ మద్దతుదారులైన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం సభలోనే కూర్చుండిపోవడం ద్వారా అన్నాడీఎంకే వాదనకు మద్దతు పలికారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement