
వానమామలై
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశ భద్రత కోసం సైనికులు కుటుంబాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఒక్కో సందర్భంలో ప్రాణాలను సైతం అర్పించాల్సి ఉంటుంది. తమిళనాడుకు చెందిన ఓ సైనికుడు సైతం అందుకు సిద్ధపడ్డాడు. నిశ్చితార్థం ముగిసి జూన్‌లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన తరుణాన్ని తృణప్రాయంగా స్వీకరించాడు. పాకిస్తాన్‌తో భారత్ యుద్ధానికి సన్నద్ధం అవుతున్న తరుణంలో ఎంతో మనోనిబ్బరాన్ని ప్రదర్శించాడు. ‘నా కోసం బెంగ పెట్టుకోవద్దు.. నేను వస్తా.. లేకుంటే నా దుస్తులు వస్తాయి’ అంటూ తన సమీప బంధువుకు వాట్సాప్ ద్వారా హృదయ విదారకమైన సందేశాన్ని పంపాడు.
వివరాలు.. తిరునెల్వేలి జిల్లా నాంగునేరి సమీపంలోని మరుకాలకురిచ్చి గ్రామంలో 300కు పైగా కుటుంబాల్లోని పలువురు యువకులు భారత సైనికదళంలో సేవలందిస్తు న్నారు. దేశ సరిహద్దులను కాపాడుతూ, వివిధ బాధ్యతల్లో విధులను నిర్వహిస్తున్నారు. వీరంతా ఏడాదికోసారి సెలవులకు మాత్రమే ఊరికి వచ్చి కుటుంబ సభ్యులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఆ సమయాల్లోనే వారికి పెళ్లి సంబంధాలు చూడడం, నిశ్చయించడం జరిగిపోతుంటుంది. ప్రస్తుతం భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండగా మరుకాల్‌కురిచ్చి దక్షిణ వీధికి చెందిన సుబ్బయ్య కుమారుడు వానమామలై (25) కూడా సైనిక దళంలో పనిచేస్తున్నాడు. గత ఏడాది మోటర్ బైక్ ప్రమాదంలో సుబ్బయ్య మరణించగా, ప్రస్తుతం అతనికి తల్లి చెల్లమ్మాల్ (50), ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. అతని అక్కకు మాత్రమే వివాహమైంది. ఇదిలాఉండగా, వానమామలైకు అదే ప్రాంతానికి చెందిన ఒక యువతితో కొన్ని నెలల క్రితం వివాహం నిశ్చయమైంది.
ఈ ఏడాది జూన్‌లో అతను సెలవులకు స్వగ్రామానికి వస్తుండగా పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించి ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి నిశ్చితార్థం జరిగిన నేపథ్యంలో వానమామలై కుటుంబ సభ్యులు, అత్తింటి వారు, కాబోయే భార్య సైతం తరచు అతనితో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నారు. కశ్మీర్ పుల్వామా ప్రాంతంలో ఇటీవల జరిగిన పాక్ ముష్కరుల దాడులకు ఎదురుదెబ్బతీసే చర్య ఈ నెల 25వ తేదీన చోటుచేసుకుంది. భారత విమాన దళాలు ఈ చర్యలు చేపట్టగా, వారిలో మధ్యప్రదేశ్ సైనిక దళాన్ని సిద్ధంగా ఉండాల్సిందిగా భారత ప్రభుత్వం ఆదేశించింది. అదే దళంలో వానమామలై కూడా సైనికుడిగా ఉన్నాడు. అప్పుడు వానమామలై తన కాబోయే భార్య బంధువుల్లో ఒకరికి వాట్సాప్ ద్వారా ఒక సందేశాన్ని పంపాడు. ‘మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మేరకు అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. యుద్ధానికి వెళుతున్న నేను తిరిగి వస్తానో రానో. నేను రాకుంటే నా దుస్తులు ఇంటికి వస్తాయి. పెళ్లి కుమార్తె పేరును ప్రస్తావిస్తూ ఈ విషయాన్ని ఆమెతో చెప్పవద్దు. ఇక అంతా దైవాదీనం. ఇకపై నేను ఫోన్‌లో మాట్లాడడానికి వీలుకాదు. వీలుంటే ఉదయం మాట్లాడతాను అంటూ వాట్సాప్‌లో సమాచారం ఇచ్చాడు. యుద్ధానికి సంబంధించిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్టు సమాచారం వచ్చిందని, తన కుటుంబ సభ్యులకు వానమామలై మరుసటి రోజు తెలియజేశాడు.దేశాన్ని రక్షించే జవానుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలిపే ఈ హృదయ విదారక సమాచారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment