సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ శనివారం అందరి దగ్గర సెలవు తీసుకుని జైలు జీవితాన్ని గడిపేందుకు ఉదయాన్నే బయలుదేరి వెళ్లారు. తంజావూరు నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార చెరకు సాయంత్రం చేరుకున్నారు. భర్త నటరాజన్ మరణంతో చిన్నమ్మ శశికళ ఈనెల 20న పెరోల్ మీద జైలు నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అంత్యక్రియల తదుపరి ఆమె తంజావూరులోని పరిశుద్ధ నగర్‌లో ఉన్న నటరాజన్ స్వగృహం అరుణానంద ఇల్లంలోనే ఉన్నారు. ఇంటి నుంచి ఆమె అడుగు బయటకు తీసి పెట్టలేదు. రాజకీయ పార్టీ వర్గాలు, ఆప్తులు, బంధువులు నిత్యం తరలివచ్చి ఆమెకు సానుభూతి తెలియజేసి వెళ్లారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలు, అనర్హత వేటు పడ్డ పలువురు ఎమ్మెల్యేలతో పదే పదే చిన్నమ్మతో భేటీ అయ్యారు.
కుటుంబ విభేదాలతో శిరోభారం
కుటుంబ విభేదాలు చిన్నమ్మకు శిరోభారంగా మారాయని సంకేతాలు ఉన్నాయి. నటరాజన్ ఆస్తుల వ్యవహారంతో పాటు, కుటుంబంలో సాగుతున్న విభేదాల పంచాయతీ చిన్నమ్మను ఉక్కిరిబిక్కిరి చేసినట్టుగా ఆ కళగం వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా ఆస్తుల విషయంగా అక్క కుమారుడు దినకరన్, తన సోదరుడు దివాకరన్ మధ్య సాగుతున్న వివాదం పరిష్కరించడం ఆమెకు కష్టతరంగా మారినట్టు తెలిసింది. అలాగే, మేనల్లుడు వివేక్ రూపంలో దినకరన్‌కు ఎదురవుతున్న సమస్యలు మరో త లనొప్పిగా మారడంతోనే ముందస్తుగానే జైలు కు వెళ్లడానికి ఆమె నిర్ణయించారని తెలుస్తోంది.
ఇక, జైలు జీవితం
పదిహేను రోజుల పెరోల్ లభించినా, ఇక్కడ అన్ని కార్యక్రమాల్ని 12 రోజుల్లో ముగించుకుని జైలు జీవితాన్ని అనుభవించేందుకు చిన్నమ్మ సిద్ధం అయ్యారు. మూడురోజుల ముందుగానే శనివారం ఉదయాన్నే పయన ఏర్పాట్లు చేసుకున్నారు. శుక్రవారం జరిగిన కర్మక్రియల అనంతరం రాత్రంతా ఆమె ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్టు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఉదయాన్నే బెంగళూరుకు పయనం అయ్యారు. అక్కడున్న బంధువులు, ఆప్తులు, సన్నిహితులు, పార్టీ వర్గాల నుంచి సెలవు తీసుకుని కాస్త ఉద్వేగానికి లోనైనట్టుగా కారులో ఎక్కి కూర్చున్నారు. అందర్నీ నమస్కారంతో పలకరిస్తూ ముందుకు సాగారు. ఆమె వాహనం వెన్నంటి అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యేలు సెంథిల్ బాలాజీ, పళనియప్పన్, తంగ తమిళ్ సెల్వన్ తదితరులు బయలుదేరి వెళ్లారు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో తంజావూరులో బయలుదేరిన శశికళ వాహనం సాయంత్రం ఐదున్నర గంటలకు పరప్పన అగ్రహార జైలుకు చేరుకుంది. తంజావూరు నుంచి వెళ్లిన వాహనాలను, తన వెన్నంటి వచ్చిన వారందరినీ రాష్ట్ర సరిహద్దుల నుంచి వెనక్కు వెళ్లిపోవాలని శశికళ ఆదేశించడం గమనార్హం.
అన్నింటినీ అధిగమిస్తారు
శశికళ బయలుదేరి వెళ్లడంతో ఆమె సోదరుడు దివాకరన్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తన సోదరికి కష్ట కాలం అని, అన్నింటినీ అధిగమించి ఆమె తప్పకుండా బయటకు వస్తారన్న నమ్మకాన్ని వ్యక్తంచేశారు. కాగా, నటరాజన్‌తో ఉన్న స్నేహం మేరకు డీఎంకే ఎమ్మెల్యేలు కేఎన్ నెహ్రు, రామచంద్రన్ శశికళను ఉదయం పరామర్శించి వెళ్లారన్నారు. శశికళను అనేకమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫోన్ ద్వారా సంప్రదించారని, తమ సానుభూతి తెలియజేశారన్నారు. తాము స్వయంగా వస్తే, ఎక్కడ పదవులు పోతాయోనని వారికి భయం ఉండడం వల్ల అందుకే వారంతా ఫోన్ ద్వారా పరామర్శించినట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment