ప్రగతి పాలన
Published Fri, Jan 31 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM
చెన్నై, సాక్షి ప్రతినిధి:అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించేందుకు గవర్నర్ కే రోశయ్య ఉద యం 11.45 గంటలకు సచివాలయం చేరుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ ధనపాల్, కార్యదర్శి జమాలుద్దీన్ ఆయనకు స్వాగతం పలికి లోనికి తీసుకెళ్లగా 12 గంటలకు గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గవర్నర్ రోశయ్య మాట్లాడడం ప్రారంభించగానే డీఎంకే ప్రతిపక్ష నేత స్టాలిన్ లేచి నిలబడి తాము మాట్లాడాల్సిన అవసరం ఉందని కోరా రు. అయితే ఇందుకు స్పీకర్ నిరాకరించడంతో డీఎంకేతో పాటూ ఆపార్టీకి మద్ద తు పలుకుతున్న పుదియతమిళగం, మని దనేయ మక్కల్ కట్చి సభ్యులు సైతం సభ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగిస్తూ, అనేక వినూత్న పథకాలు, విదేశీ సంస్థల సహకారంతో రాష్ట్రం ప్రగతిబాటలో పయనిస్తోందని కితాబిచ్చారు.
జపాన్ సంస్థ సహకారంతో రాష్ట్రంలో రూ.770 కోట్లతో పారిశ్రామిక ప్రగతిని రాష్ట్రం సాధించనుందని అన్నారు. 2013-14 వార్షిక బడ్జెట్ కింద రూ.37,128 కోట్లు కేటాయించగా, 2014-15కు రూ.42,185 కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. రాష్ట్రం 33 శాతం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నా ఆహార ధాన్యాల దిగుమతులకు లోటుకలగకుండా జాగ్రత్తపడిందని చెప్పారు. ఆహార భద్రత కోసం 2013-14 కు రూ.400 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇది కాక కేంద్రం ప్రవేశపెట్టిన ఆహారభద్రత చట్టాన్ని సరైన రీతిలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. విద్యుత్, తాగునీరు తదితర అవసరాలకు రూ.834 కోట్లతో 12 పథకాలను ప్రభుత్వం సిద్ధం చేసిందని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు.
అనుమతివ్వనందుకే వాకౌట్
అసెంబ్లీ వెలుపల మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగానికి ముందుగా మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరినా అనుమతించనందున వాకౌట్ చేయాల్సివచ్చిందని తెలిపారు. 2013 జనవరి 1వ తేదీనాటి గవర్నర్ ప్రసంగంలో అనేక పొరపాట్లు దొర్లగా వాటిని సరిదిద్దాలని ఆనాడే కోరామని తెలిపారు. అయితే నేటి వరకు సవరింపులు జరగకపోగా తాజా ప్రసంగంలో మరిన్ని తప్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. రాష్ట్రంలో అసమర్థ పాలన, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, పరువు నష్టందావాలు, ప్రతిపక్షాల సభలకు పోలీస్ అనుమతి నిరాకరణ వంటివి సాగడాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించామని తెలిపారు.
Advertisement