• ఆరోగ్య క్షేమం కోసం పూజల హోరు
• ఆలయాలకు పాల బిందెలతో ఊరేగింపు
• హోమాలు
• పరామర్శల్లో నేతలు
సాక్షి, చెన్నై: అపోలో ఆసుపత్రిలో 18 రోజులుగా చికిత్స పొందుతున్న సీఎం జయలలిత సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా సేవకు మళ్లీ అంకితం కావాలని కాంక్షిస్తూ భక్తి భావంతో అన్నాడీఎంకే వర్గాలు ఆదివారం పూజల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో, వాడవాడల్లో పూజలు, హోమాలు, అభిషేకాలతో ముందుకు సాగారు. ఇక, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామితో పాటుగా పలు పార్టీల నాయకులు జయలలిత ఆరోగ్యంపై వైద్యుల వద్ద ఆరా తీశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత త్వరితగతిన కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్య వంతురాలిగా మళ్లీ ప్రజా సేవ సాగించాలని సర్వత్రా ఆకాంక్షిస్తూ వస్తున్నారు. అయితే,ఆమె ఆరోగ్యంపై రక రకాల వదంతులు బయలు దేరడం అన్నాడీఎంకే వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది. ఈ పరిస్థితుల్లో అమ్మ సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు భక్తి భావం మిన్నంటే విధంగా అన్నాడీఎంకే వర్గాలు పూజల్లో నిమగ్నం అయ్యారు. మదురైలో జయ పేరవై, అన్నాడీఎంకే జిల్లా పార్టీ నేతృత్వంలో యాభై వేల మందితో భారీ పాల బిందెల ఊరేగింపు తిరుప్పర గుండ్రం వరకు సాగింది. ఆరుపడై వీడుల్లో ఒకటిగా ఉన్న తిరుప్పర గుండ్రం సుబ్రమణ్యస్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలను తలపించే విధంగా ఈ ఊరేగింపు మేళ తాళాలు, గజరాజుల ఘీంకారాల నడుమ సాగాయి.
ఆలయంలో విశిష్ట పూజలు, స్వామి వారికి అభిషేకాల అనంతరం భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక, రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాలు, వాడ వాడల్లో ఉన్న చిన్న చిన్న ఆలయాల్లోనూ పూజలు, పాల బిందెలతో ఊరేగింపుగా వెళ్లి స్వామి, అమ్మవార్లకు అభిషేకాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇక, అనేక క్రైస్తవ ఆలయాల్లోనూ ప్రార్థనలు చేశారు.
అమ్మకు పరామర్శ: అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఉదయం నుంచి రాత్రి వరకు పలు పార్టీలకు చెందిన వాళ్లు తరలివచ్చారు. ఆదివారం అపోలోకు వచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విలేకరులతో మాట్లాడుతూ జయలలిత ఆరోగ్యంపై వదంతులు సృష్టించడం మంచిది కాదని పేర్కొన్నారు. పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నమశ్శివాయం ఉదయాన్నే ఆసుపత్రిలో పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వంలను కలుసుకున్నారు.
అమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ , మనిదనేయ మక్కల్ కట్చి నేత జవహరుల్లా, సీపీఐ జాతీయ కార్యదర్శి, ఎంపీ.డీ. రాజాల, పీఎంకే యువజన నేత , ఎంపీ అన్భుమణి రాందాసు, పీఎంకే నేత జీకే మణి, సీనియర్ నేత ఏకేమూర్తి వేర్వేరుగా ఆసుపత్రి వద్దకు చేరుకుని అమ్మ ఆరోగ్యంపై విచారించారు.
ఆపద్ధర్మ సీఎం: సీఎం అనారోగ్య కారణాల దృష్ట్యా, కుంటు పడ్డ ప్రభుత్వ పరిపాలనను గాడిలోపెట్టేందుకు ఆపద్ధర్మ సీఎం లేదా కొత్త సీఎంను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. అయితే, ఆపద్ధర్మ సీఎం ఈ పరిస్థితుల్లో అవసరం లేదని టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక, అమ్మ ఆరోగ్యం మెరుగు పడుతున్న దృష్ట్యా, ఆపద్ధర్మ సీఎంతో పనిలేదని అన్నాడీఎంకే తేల్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి.
ఇదే విషయాన్ని గవర్నర్(ఇన్) విద్యాసాగర్‌రావుతో సాగిన బేటీలో అన్నాడీఎంకే సీనియర్ మంత్రులు స్పష్టం చేసి ఉన్నారు. అమ్మ కోలుకుంటున్న దృష్ట్యా, త్వరితగతిన మళ్లీ ప్రజాసేవకు అంకితం అవుతారని, ఈ సమయంలో మంత్రి వర్గంలో ఎలాంటి మార్పులు చేయకూడదన్న నిర్ణయానికి అన్నాడీఎంకే వర్గాలు వచ్చి ఉండడం గమనార్హం.
మిన్నంటిన అమ్మ భక్తి
Published Mon, Oct 10 2016 1:27 AM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM
Advertisement
Advertisement