► పడకపై కూర్చుని భోజనం
► సీఎం మాట్లాడుతున్నారు
► అపోలో హెల్త్ బులెటిన్ విడుదల
సాక్షి ప్రతినిధి, చెన్నై: అపోలో ఆసుపత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కోసం అపోలో ఆసుపత్రి చేసిన కృషి సఫలీకృతమైందా, అమ్మ కోలుకోవాలని కోరుకుంటూ లక్షలాది మంది చేసిన పూజలు ఫలించాయా...శుక్రవారం నాటి పరిస్థితిని సమీక్షించుకుంటే అవుననే సమాధానం వస్తోంది. ముఖ్యమంత్రి జయలలిత సంభాషిస్తున్నట్లుగా అపోలో ఆసుపత్రి శుక్రవారం విడుదల చేసిన హెల్త్‌బులెటిన్‌లో స్పష్టం చేయడం గమనార్హం. గతనెల 22వ తేదీ అర్ధరాత్రి వేళ సీఎం జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరారు. కేవలం జ్వరం, డీహైడ్రేషన్ మాత్రమేనని అపోలో వైద్యులు ప్రకటించారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తున్నట్లు తెలిపారు. అన్నాడీఎంకే శ్రేణులు సైతం అమ్మకు ఏమీ కాలేదు. నేడో రేపో ఇంటి ముఖం పడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలా అంచనాలు వేస్తుండగానే మూడు వారాల క్రితం అపోలో ఆసుపత్రి వద్ద ఉత్కంఠ నెలకొంది. అమ్మకు ఏదో అయిపోయిందనే ప్రచారం మొదలైంది.
మీడియా సైతం అదే హడావిడి చేసింది. గవర్నర్ విద్యాసాగర్‌రావు హడావుడిగా అపోలోకు చేరుకున్నారు. లండన్ నుంచి డాక్టర్ రిచర్డ్‌ను రప్పించారు. ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుల బృందం చెన్నైకి పరుగులు పెట్టింది. సింగపూర్ నుంచి మహిళా ఫిజియోథెరపిస్టులు అపోలోకు చేరుకున్నారు. వీరికి తోడు సీఎం వ్యక్తిగత వైద్యులు డాక్టర్ శివకుమార్ నేతృత్వంలోని అపోలో వైద్యుల బృందం ఎలానూ ఉంది. అయితే అదృష్టవశాత్తు ఉత్కంఠ పరిస్థితులు సద్దుమణిగాయి. అమ్మ కోలుకుంటున్నారనే ప్రకటనతోనే నెలరోజులు గడిచిపోయాయి. ఈ నెల రోజుల కాలంలో అనేక దశల్లో తీవ్రస్థాయి చికిత్సలు చేశారు. చికిత్సలకు సీఎం శరీరం బాగా స్పందిస్తూ ఆమె కోలుకుంటున్నందునే హెల్త్ బులెటిన్లు విడుదల చేయడం లేదని అపోలో వైద్యులు అంటున్నారు. ఏమైతేనేమీ అమ్మ బాగా కోలుకోవడంతోపాటు ఆసుపత్రిలోని బెడ్‌పై కూర్చుని ఆహారం కూడా తీసుకుంటున్నట్లుగా శుక్రవారం శుభసమాచారం వెలుగులోకి వచ్చింది.
సింగపూరు నుంచి వచ్చిన ఫిజియోథెరపిస్టులు అపోలోలోనే ఉండగా, డాక్టర్ రిచర్డ్ ఈనెల 23వ తేదీన లండన్ నుంచి మళ్లీ చెన్నైకి చేరుకుంటున్నారు. డాక్టర్ రిచర్డ్‌తోపాటు ఇతర వైద్యులు జయ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి మరో వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని అన్నాడీఎంకే శ్రేణులు ఆశిస్తున్నాయి. కాగా పదిరోజుల తరువాత అపోలో ఆసుపత్రి శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో సైతం సీఎం క్రమేణా కోలుకుంటున్నారని, మాట్లాడుతున్నారని స్పష్టం చేయడం విశేషం.
ట్రాఫిక్ రామస్వామిపై రెండు కేసులు: సీఎం జయలలితకు జరుగుతున్న చికిత్స పట్ల అవమానకరంగా వ్యాఖ్యానించిన సామాజిక కార్యకర్త ‘ట్రాఫిక్’ రామస్వామిపై చెన్నై సైబర్ క్రైం పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి జయలలితకు జరుగుతున్న చికిత్సపై సవివరమైన ప్రకటన చేయాలంటూ ఒక వైద్యుడు దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. సీఎంకు జరుగుతున్న చికిత్స గురించి అడి గే హక్కు మీకు లేదని పేర్కొంటూ న్యాయమూర్తి ఆ పిటిషన్‌ను కొట్టివేశారు.
కొనసాగుతున్న ప్రార్థనలు : ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుతూ రాష్ట్రమంతా ప్రార్థనలు కొనసాగుతున్నాయి. దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి చైర్మన్ సీ కల్యాణ్ అధ్వర్యంలో రెండు రోజుల మహా మృత్యుంజయ మూలమంత్ర జపయాగం శుక్రవారం ప్రారంభమైంది. ఈ యాగంలో 30 శివార్చకులు యాగాన్ని నిర్వహించగా, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు కలైపులి థాను, మండలి గౌరవ కార్యదర్శి కాట్రగడ్డ ప్రసాద్, నిర్మాతలు కొండ్రెడ్డి కృష్ణారెడ్డి, రవికొట్టార్కర, ఎల్ సురేష్ పాల్గొన్నారు. దక్షిణ చెన్నై ఎంజీఆర్ సంఘం నేతలు శాంతోమ్ చర్చిలో శుక్రవారం ప్రార్థనలు చేశారు. సైదాపేట అమ్మన్ ఆలయంలో మాజీ మంత్రి వలర్మతి పూజలు చేశారు. ఎమ్మెల్యే వెట్రివేల్ నేతృత్వంలో వ్యాసార్పాడి కరుమారి అమ్మన్ ఆలయానికి వెయ్యిమంది మహిళలు పాల కలశాలతో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆరోగ్యమస్తు
Published Sat, Oct 22 2016 2:43 AM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM
Advertisement
Advertisement