
టాస్మాక్ రాబడి రూ.21వేల కోట్లు
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో మద్యాన్ని నేరుగా ప్రభుత్వమే విక్రయిస్తోంది. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ నేతృత్వంలో టాస్మాక్ పేరిట మద్యం దుకాణాలను నెలకొల్పింది. ఐదారేళ్లుగా రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరందుకుంటున్నాయి. వేలల్లో ఆదాయం వస్తుండడంతో సరికొత్త తరహా బ్రాండ్లను ఈ దుకాణాల్లో అందుబాటులోకి తెచ్చారు. అలాగే, అతి పెద్ద మాల్స్‌లో ఎలైట్ పేరిట వైన్స్ ఏర్పాటు చేశారు. మార్కెటింగ్ శాఖ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 6800 టాస్మాక్ దుకాణాలు ఉన్నాయి. 4371 టాస్మాక్ బార్లు, ఏడు వేల 39 చిల్లర విక్రయాల దుకాణాలు ఏర్పాటు చేశారు.
ఆరేళ్ల క్రితం వరకు ఏడాదికి రూ. ఐదు వేల కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే, ఇటీవల కాలంగా వేలల్లో విక్రయాలు సాగుతున్నాయి. 2011-12లో 18 వేల కోట్లు ఆదాయం రాగా, 2012-13లో ఇరవై వేల కోట్లు దాటింది. ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో విక్రయాలు సాగడంతో 21,680 కోట్ల రాబడి ప్రభుత్వానికి వచ్చింది. ఏడాదికా ఏడాది విక్రయాలు పెరగడం బట్టి చూస్తే, రాష్ట్రంలో మందుబాబుల సంఖ్య ఏ మేరకు ఉన్నదో, ఏ మేరకు తాగి తగలేస్తున్నారో అన్నది స్పష్టం కాక తప్పదు. దీంతో రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం నినాదాన్ని అనేక పార్టీలు అందుకున్నాయి. మద్య నిషేధం లక్ష్యంగా ఉద్యమాలతో ముందుకు సాగుతున్నాయి.
తగ్గిన రాబడి
ఇన్నాళ్లు ఆదాయం పైపైకి వెళుతుంటే, ఈ సారి కాస్త తగ్గుముఖం పట్టడం గమనించాల్సిందే. 2013-14లో 21,640 కోట్లు రాబడి వచ్చింది. 2012-13తో పోల్చితే 40 కోట్ల వరకు తక్కువగా ఉండడం గమనార్హం. ఇదే విషయాన్ని ఆ శాఖ మంత్రి నత్తం విశ్వనాథన్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గం టాస్మాక్ మద్యం దుకాణాలు మాత్రమేనని, తమిళనాడులో ఎలా మద్య నిషేధం అమలు చేయగలమని మంత్రి ప్రశ్నించడం గమనార్హం. ఇక, ఈ ఏడాది రూ.40 కోట్ల వరకు రాబడి తగ్గడానికి మందుబాబుల సంఖ్య తగ్గినట్టు భావించడం తప్పులో కాలేసినట్టే. టాస్మాక్ ఉద్యోగుల డిమాండ్ల మేరకు ప్రభుత్వ సెలవు దినాలు 2013లో పెరిగాయి. అలాగే, లోక్ సభ ఎన్నికలు, ఫలితాల లెక్కింపు కాస్త ఈ దుకాణాలకు తాళం వేయించడం, అలాగే, టాస్మాక్ వేళల తగ్గింపుతో ఈ స్వల్ప తగ్గుదల చోటు చేసుకుందంటూ మార్కెటింగ్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.