నా భర్త చనిపోయాడని చెప్పండి
అప్పుడే నా జీవితానికి ఆసరా
హైకోర్టులో ఉపాధ్యాయుడి భార్య పిటిషన్
సాక్షి, బెంగళూరు: ఏ భారతీయ మహిళ అయినా తన భర్త చిరాయువుగా ఉండాలని, తాను సుమంగళిగా కన్నుమూయాలని తపిస్తుంది. కానీ విధి ఆమెకు భిన్నంగా రాసింది. భర్త మరణించాడని ప్రకటిస్తే తప్ప ఆమె జీవితం చక్కబడదు. అందుకే ఆ విధంగా గొంతెత్తక తప్పలేదు. ఏడేళ్ల నుంచి చేస్తున్న పోరాటం ఇప్పుడు హైకోర్టు మెట్లెక్కింది. తన భర్త చనిపోయారని ప్రకటించాల్సిందిగా ఓ మహిళ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు ఈ విషయమై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
కోర్టుకు బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. రామనగర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శివకుమారస్వామితో స్థానికంగా నివాసముంటున్న సుమంగళకు 2006లో వివాహమైంది. ఈ క్రమంలో 2010 జనవరి 8న పాఠశాలకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన శివకుమార్ కనిపించకుండా పోయారు. ఒకటి రెండు రోజులు బంధువులు, స్నేహితులను విచారించిన సుమంగళ తర్వాత స్థానిక ఐజూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల తర్వాత విద్యాశాఖ శివకుమార్ గైర్హాజరినీ పేర్కొంటూ జీతాన్ని ఆపివేసింది.
ఫలించని ప్రయత్నాలు
అప్పటి నుంచి సుమంగళి కష్టాలు రెట్టింపయ్యాయి. కుటుంబం గడవడం కోసం బంధువులు సాయపడుతూ వచ్చారు. ఎన్నిసార్లు విద్యాశాఖ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. దీంతో 2014లో ఈ విషయాలన్నీ వివరిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అప్పట్లో కేసును విచారించిన హైకోర్టు త్వరగా శివకుమార్ జాడ కనిపెట్టాలని పోలీసులను ఆదేశించినా ఉపయోగం లేదు. దీంతో ఆమె హైకోర్టు తలుపుతట్టారు. తన భర్త చనిపోయాడని ప్రకటించాలని, తద్వారా విద్యాశాఖలో తనకు ఉద్యోగం లభిస్తుందని అందులో పేర్కొంది. ప్రభుత్వ న్యాయవాది ప్రతిమా హొన్నాపుర మాట్లాడుతూ... ‘ఒక వ్యక్తి కనిపించకుండా పోయి ఏడేళ్లు దాటితే మరణించారని భావించవచ్చు. కోర్టు ఆదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం.’ అని పేర్కొన్నారు.