గాయాలను చూపిస్తున్న విద్యార్థులు ,టీచర్ అశ్విని
దొడ్డబళ్లాపురం: పిల్లలకు మంచి చదువులు చెప్పి కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు బాధ్యత మరచి ప్రవర్తించారు. తన హ్యాండ్‌బ్యాగులో ఉన్న 500 రూపాయలు కనబడలేదని ఇద్దరు టీచర్లు 5వ తరగతి చదువుతున్న 10 మంది విద్యార్థులను వరుసగా నిలబెట్టి బెత్తంతో చితకబాదిన సంఘటన మాజీ సీఎం సిద్ధరామయ్య నియోజకవర్గం బాదామి తాలూకాలో చోటుచేసుకుంది. టీచర్‌లు కొట్టిన దెబ్బలకు పిల్లల శరీరంపై రక్తగాయాలతోపాటు బొబ్బలు వచ్చాయి. బాధతో పిల్లలు ఏడుస్తుంటే తల్లితండ్రులు తల్లడిల్లిపోతున్నారు. బాదామి తాలూకా రాఘాపుర గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్లుగా విధులు నిర్వహిస్తున్న అశ్విని, చంద్రు ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. అశ్విని బ్యాగులో 500 రూపాయలు కనబడలేదని దాన్ని పిల్లలే తీశారని అనమానంతో ఆమెతో పాటు చంద్రు కలిసి బెత్తం తీసుకుని 10 మంది విద్యార్థులను నిజం చెప్పమంటూ తీవ్రంగా కొట్టారు.
గ్రామస్తులపైనా మండిపాటు
విషయం తెలిసి ఇదేమని ప్రశ్నిస్తే తమతో పెట్టుకోవద్దని గ్రామస్తులను బెదిరించారు. ఈ సంఘటన కవరేజీకి వెళ్లిన ఒక టీవీ చానెల్ రిపోర్టర్‌ను కూడా టీచర్లు వదల్లేదు. కాలర్ పట్టుకుని బెదిరించినట్లు సమాచారం. ఇంత జరిగినా బీఈఓ కానీ, డీడీ కానీ స్పందించకపోవడం పట్ల గ్రామస్తులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment