ఇదేనా.. రక్షణ | tejveer singh died in ins sindhu dhwaj submarine | Sakshi
Sakshi News home page

ఇదేనా.. రక్షణ

Published Thu, Oct 13 2016 8:22 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

tejveer singh died in ins sindhu dhwaj submarine

మూడురోజుల్లో ఇద్దరు ఉద్యోగులు మృతి
తన పిస్టల్‌కేబలైన తేజ్‌వీర్‌సింగ్
అలవాటైన పనిలోనే ప్రాణాలు విడిచిన పాండే
కాలం చెల్లిన ఆయుధాలు, యంత్రాలు, నౌకలతో తరచూ ప్రమాదాలు
 
 
మొన్న నావికుడు..  నేడు సబ్ లెఫ్టినెంట్ దుర్మరణం.. ఒకరిది విద్యుత్ షాక్.. మరొకరిది ఆత్మహత్య అని అనుమానం.. తూర్పు నావికాదళంలో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.. ఎందుకిలా జరుగుతోంది?.. వాస్తవాలు ఎందుకు బయటకు రావడం లేదు??.. నౌకలు పాతబడిపోయి ప్రమాదాలకు ఆస్కారమిస్తుండటం.. ఉద్యోగపరంగా ఎదురవుతున్న ఒత్తిళ్లు.. ఉద్యోగుల మరణాలకు కారణమవుతున్నట్లు తెలుస్తున్నా.. అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు.. ప్రత్యేక విచారణ జరుపుతున్నామంటున్నారు గానీ.. ఆ తర్వాత కూడా ఆ వివరాలు బయటకు రావడం లేదు..
 
సాక్షి, విశాఖపట్నం : నిర్లక్ష్యమో.. నిర్వహణ లోపమో.. ఒత్తిళ్లో.. కారణమేదైనా.. తూర్పు నావికాదళ సిబ్బంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఐఎన్‌ఎస్ సింధ్‌ధ్వజ్‌సబ్‌మెరైన్‌లో పాండే అనే నావికుడు విద్యుత్ షాక్‌తో మృతిచెందిన ఒకరోజు వ్యవధిలోనే 9 ఎంఎం పిస్టల్ మిస్‌ఫైర్ కావడంతో సబ్ లెఫ్టినెంట్ తేజ్‌వీర్‌సింగ్ మృతి చెందాడు. కాగా తేజ్‌వీర్ సింగ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
అతను తన పిస్టల్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డాడని, సూసైడ్ లేఖ కూడా సంఘటన ప్రదేశంలో లభించిందని తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం బయటకు వెల్లడించని ఉన్నతాధికారులు ప్రత్యేక విచారణకు మాత్రం ఆదేశించారు. ఇక పాండే విద్యుత్ షాక్‌తో గురై పదో తేదీన చనిపోతే మరుసటి రోజు వరకూ అధికారులు విషయం బయటపెట్టలేదు. నిజానికి పాండే సాధారణ ఎలక్ట్రీషియన్ కాదు. నేవీలో లీడింగ్ ఎలక్ట్రికల్ పవర్ సెయిలర్. అలాంటి వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై చనిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
 
పురాతన నౌకలతో యాతన
ఐఎన్‌ఎస్ సింధుధ్వజ్ సబ్‌మెరైన్ నేవీలో 1987లో ప్రవేశించింది. ఇది సింధుఘోష్ తరహా సెకండ్ అటాక్ సబ్‌మెరైన్. ఇందులో ఆరు ఎలక్ట్రికల్, డీజిల్ మోటార్లు  ఉంటాయి. 52 మంది సిబ్బంది ఉంటారు. ఐఎన్‌ఎస్ కుఠార్ కూడా 1990లో భారత నేవీలో ప్రవేశించింది. 2014లో ఒకసారి నౌక  దెబ్బతినడంతో బాగుచేసి మళ్లీప్రవేశపెట్టారు. వీటిలో ఒకటి 29 ఏళ్లుగా, మరొకటి 26 ఏళ్లుగా సేవలందిస్తున్నాయి.
 సబ్‌మెరైన్ పూర్తిగా శిథిల స్థితికి చేరుకున్నా ఇంకా వినియోగిస్తున్నారు. లోపలి ఎలక్ట్రికల్ విభాగాలు చాలా వరకూ దెబ్బతిన్నాయని సమాచారం. అయినప్పటికీ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో ప్రతిభ గల ఉద్యోగిని కోల్పోవాల్సి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 తరచూ ప్రమాదాలు
 గత ఏడాది ఈస్ట్రన్ నేవల్ కమాండ్‌లో ఓ ఉద్యోగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మార్చి 2014లో అరిహంత్ సబ్‌మెరైన్‌లో హైడ్రాలిక్ ట్యాంక్‌లో ఒత్తిడితో ఓ కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. నేవీలో ఇలా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు బయటకు రావడం లేదు.
 
 పాండే సోమవారం విద్యుత్ షాక్‌కు గురై మరణిస్తే మంగళవారం వరకూ ప్రకటించలేదు. పాత నౌకల్లో పరికరాలు ఊడిపోయి, విరిగిపోయి సిబ్బందిపై పడటంతో తరచుగా గాయాలపాలవుతున్నారు. మరోవైపు రోజుల తరబడి విధుల్లో ఉండటం.. కుటుంబాలకు దూరం కావడం వంటి కారణాలతో సిబ్బంది మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితికి వచ్చేస్తున్నారు. అయినా ఇలాంటి విషయాలను నేవీ అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. రక్షణ విభాగాల్లో విషయాలు రహస్యంగా ఉం చడం మంచిదే అయినా.. ప్రమాదాల సమాచారాన్ని కూడా దాచిపెట్టడం సమంజసం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement