మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్
హైదరాబాద్: సెల్ ఫోన్ వినియోగదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మొబైల్ ఫోన్లపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్) తగ్గిస్తూ టీఆర్‌ఎస్ సర్కారు నిర్ణయం తీసుకుంది. వ్యాట్ ను 14 నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్టు కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో సెల్ ఫోన్ల ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి.
పాత పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. మొబైల్ ఫోన్ ద్వారా నగదు రహిత లావాదేవీలు జరిపే వినియోగదారులకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఊరట కలిగించనుంది.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసిన సెల్ ఫోన్ సంస్థలు వ్యాట్ తగ్గించాలని కొంతకాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయం మొబైల్ తయారీ కంపెనీలకు ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది. ప్రభుత్వ నిర్ణయంపై సెల్ ఫోన్ కంపెనీలు, డీలర్లు, వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.