కృష్ణమ్మా.. రావమ్మా!
Published Sun, Mar 16 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 AM
వేసవి కాలం సమీపించింది. చెన్నైలో నీటి ఎద్దడి నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కండలేరు నీటి మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఏప్రిల్లో మళ్లీ నీటి విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రజా పనుల శాఖ ఇచ్చిన హామీ అమలయ్యేనా అన్న ఆందోళన చెన్నై నీటి పారుదల శాఖ అధికారుల్లో నెలకొంది.
సాక్షి, చెన్నై:చెన్నై మహానగరానికి రోజుకు 831 మిలి యన్ లీటర్ల తాగునీరు అవసరం. పుళల్, పూండి, చోళవరం, సెంబరబాక్కం, సెంగుండ్రం చెరువులు, కడలూరు కాట్టుమన్నార్ కోవిల్ వీరానం చెరువు నీటిని చెన్నైకు సరఫరా చేస్తూ వస్తున్నారు. నిర్లవణీకరణ పథకం ద్వారా సముద్రపు నీటిను శుద్ధీకరించి రోజుకు 170 మిలియన్ లీటర్ల నీటిని పంపుతున్నారు. ఇది తాగు నీటి అవసరాలకు ఉపయోగ పడదు. వర్షాభావ పరిస్థితులు, కండలేరు నీళ్లు ఆగడం వెరసి నగరంలో జల గండాన్ని సృష్టిస్తున్నాయి. దీంతో మెట్రో వాటర్ బోర్డు వర్గాలకు బెంగ పట్టుకుంది.
అడుగంటిన జల వనరులు : వీరానం, పుళల్, పూండి, చోళవరం, సెంబరబాక్కం, సెంగుండ్రం చెరువుల్లోనూ నీళ్లు అడుగంటుతున్నాయి. అగ్ని నక్షత్రానికి ముందే భానుడు తన ప్రతాపం చూపించే పనిలో పడ్డాడు. దీంతో నీటి మట్టాలు క్రమంగా తగ్గుతున్నాయి. కండలేరు నీళ్లు పూర్తి స్థాయిలో ఆదుకుంటాయని భావించిన మెట్రో వాటర్ బోర్డుకు భంగపాటు తప్పలేదు. కండలేరు నుంచి చెన్నైకు పంపింగ్ అవుతున్న నీటి సరఫరా క్రమంగా తగ్గింది. తాజాగా పూర్తి స్థాయిలో నీళ్లు ఆగింది. దీంతో కండలేరు నీటిని ఎలాగైనా పంపింగ్ చేసుకోవడం లక్ష్యంగా మెట్రో వాటర్‌బోర్డు రంగంలోకి దిగింది.
మళ్లీ విడుదల: కండలేరు నీళ్లు ఆగడంతో శనివారం మెట్రోవాటర్ బోర్డు వర్గాలు మేల్కొన్నాయి. ఆంధ్రా ప్రజా పనుల శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపినట్టుసమాచారం. నీళ్లు ఉన్నట్టుండి ఆపడంపై ప్రశ్నించినట్టు తెలిసింది. చెన్నైకు వాటాగా విడుదల చేయాల్సిన 12 టీఎంసీల నీళ్లు సరిగ్గా అందడం లేదని అక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు మెట్రో వాటర్‌బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే, కండలేరు పరిసరాల్లోని పంట పొలాలకు నీటి సరఫరా చేయాల్సి రావడం వల్లే, చెన్నైకు నీటిని నిలుపుదల చేసినట్టు అక్కడి అధికారులు పేర్కొన్నారని వివరించారు. ఏప్రిల్లో మళ్లీ నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే, ఈ హామీని ఎంత వరకు అక్కడి అధికారులు నిలబెట్టుకుంటారోనన్న ఆందోలన మెట్రోవాటర్ బోర్డు వర్గాల్లో నెలకొంది.
ప్రత్యామ్నాయం: నగరంలో నీటి ఎద్దడి తలెత్తని రీతిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మీద అధికారులు దృష్టి కేంద్రీకరించారు. గత ఏడాది నగర శివారుల్లో ఏర్పాటు చేసిన బోరు బావుల నీటిని ఉపయోగించుకుని, లారీల ద్వారా సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మెట్రో వాటర్‌బోర్డు ఉన్నతాధికారి ఒకరు పేర్కొంటూ, ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి ఎద్దడి తల్తెదన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగని రీతిలో తాము ముందస్తు చర్యలు తీసుకునే పనిలో ఉన్నామన్నారు. అయితే, కండలేరు నీళ్లు ఏప్రిల్లో సకాలంలో విడుదలైన పక్షంలో తమకు మరింత చేయూత నిచ్చినట్టు అవుతుందని పేర్కొనడం గమనార్హం.
Advertisement
Advertisement