మరో వారంలో నోటిఫికేషన్
ఏప్రిల్, మేలో పోలింగ్
ఒకే విడత పోలింగ్‌కు నిర్ణయం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఎన్నికల నగారా మరో వారం రోజుల్లో మోగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూలు వెలువడనుందని తెలుస్తోంది. తమిళనాడు, పుదుచ్చేరీలతోపాటు కేరళ, అసోం, పశ్చిమ బెంగాల్ మొత్తం ఐదు రాష్ట్రాల ప్రభుత్వాలకు మే, జూన్ మాసాల్లో పదవీకాలం ముగుస్తుంది. తమిళనాడు ప్రభుత్వానికి మే 22వ తేదీతో ముగియనుంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై ప్రధాన ఎన్నికల కమిషనర్ నజీమ్ జైదీ అధ్యక్షతన ఈనెల 24వ తేదీన ఢిల్లీలో సమావేశాలు జరిగాయి. తమిళనాడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ హాజరుకాగా, తొలిరోజున ఓటర్లను ముఖ్యంగా వికలాంగులు శ్రమలేకుండా పోలింగ్ బూత్‌లకు రప్పించే అంశంపై చర్చ జరిగింది. గురువారం నాడు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. గత కొన్ని దశాబ్దాలుగాతమిళనాడులో ఒకే దశ పోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఈసారి సైతం ఒకేదశ పోలింగ్‌కు నిర్ణయం జరిగినట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం 45 రోజులకు ముందు నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. ఈ లెక్కన మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ జారీచేసి మే నెల రెండవ వారంలోగా ఎన్నికల ప్రక్రియను ముగించాలని నిర్ణయించినట్లు డిల్లీ సీఈసీ వర్గాల ద్వారా తెలిసింది. మరోవారంలోగా సీఈసీ మరోసారి సమావేశమై ఈ రెండు రోజుల్లో తీసుకున్న నిర్ణయాలను తుదిసారిగా సమీక్షించి నోటిఫికేషన్ వెలువరిస్తారని అంచనా. ఫిబ్రవరి 29 లేదా మార్చి 2వ తేదీ నోటిఫికేషన్ విడుదల కావచ్చని భావిస్తున్నారు. తమిళనాడులో పోలింగ్‌ను ఏప్రిల్ చివరనా లేదా మే మొదటివారంలోనా అనే అంశంపై ఇంకా తర్జనభర్జన పడుతున్నారు. మే మొదటి వారంకే ఎక్కువశాతం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా ఓటర్ల తుదిజాబితా సిద్ధం చేస్తున్నారు.
రాష్ట్రానికి పారామిలిటరీ దళాలు:
ఎన్నికల బందోబస్తు నిమిత్తం గత ఏడాది కంటే ఎక్కువ సంఖ్యలో పారామిలిటరీ దళాలు చేరుకుంటున్నాయి. బందోబస్తు అంశం గురువారం చర్చకు వచ్చిన సందర్భంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ మాట్లాడుతూ, గత ఎన్నికల కంటే ఎక్కువ సంఖ్యలో బలగాలు అవసరమని కోరినట్లు సమాచారం. 2011 నాటి అసెంబ్లీ ఎన్నికలకు 240 బెటాలియన్ల జవాన్లు బందోబస్తు నిర్వహించారు. ఒక బెటాలియన్‌లో 72 నుంచి వందమంది వరకు జవాన్లు ఉంటారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో మరింత బలగాలు కావాలని కోరారు. లఖానీ కోర్కెను ఆమోదించిన సీఈసీ అదనపు బలగాలను పంపనున్నారు.
మోగనున్న ఎన్నికల నగారా
Published Fri, Feb 26 2016 3:03 AM | Last Updated on Mon, Sep 17 2018 5:59 PM
Advertisement
Advertisement