బళ్లారి టౌన్, న్యూస్‌లైన్ : కళాకారులపై ప్రభుత్వాలు పక్షపాత ధోరణి అవలంభిస్తున్నాయని శ్రీ పండిత పుట్టరాజ కవి గవాయి సేవా సంఘం అధ్యక్షుడు ఎం.మృత్యుంజయ స్వామి విమర్శించారు. నగరంలోని ముండ్లూరు రామప్ప సభాంగణంలో శనివారం పుట్టరాజ కవి గవాయిల 3వ వర్ధంతిని కల్యాణ స్వామీజీ ఆధ్వర్యంలో జరుపుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. లింగైక్య పుట్టరాజ కవి గవాయిలు దేశ వ్యాప్తంగా పేరు గాంచిన కళాకారుడని, ఆయనకు స్మారకాన్ని నిర్మించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందన్నారు.
గత ముఖ్యమంత్రి యడ్యూరప్ప రూ.5 కోట్లతో గదగ్‌లో స్మారకాన్ని నిర్మిస్తామని వాగ్ధానాలు చేశారని, అయితే నేటికీ మూడేళ్లు కావస్తున్నా దానిని నిర్మించలేదన్నారు. గవాయికి దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు, వేలాది మంది కళాకారులున్నారని గుర్తు చేశారు. గవాయిల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అవార్డులుప్రకటించక పోవడం విచారకరమన్నారు. త్రిభాషా కవిత్వాలు, వందలాది గ్రంథాలు రచించారని, ఆయనకు పలు అవార్డులు లభించాయన్నారు. నిత్య బ్రహ్మచారిగా ఉంటూ జీవన పర్యంతం నిస్వార్థంగా సమాజానికి సేవలందించారని, అలాంటి మహనీయునికి స్మారక నిర్మాణంపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.
ఆయన వర్ధంతి సందర్భంగా 250 మంది అంధులకు పాలు, బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ నెలాఖరున నేత్రదాన శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. 101 మంది స్వచ్ఛందంగా నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక రక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు బసవరాజ స్వామి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జరిగిన వర్ధంతి కార్యక్రమంలో స్నేహకూటమి అధ్యక్షుడు కల్లుకంబ పంపాపతి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నేమిరాజ నాయక్, కార్యదర్శి మురారిగౌడ, కేఏ రామలింగప్ప పాల్గొన్నారు.
‘కళాకారులపై ప్రభుత్వాలు పక్షపాత ధోరణి’
Published Sun, Sep 15 2013 1:29 AM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM
Advertisement
Advertisement