తెలుగు వారి ఓట్లు ఏ పార్టీకి పడనున్నాయో?
హొసూరు: శాసనసభ సాధారణ ఎన్నికల్లో తమిళనాడులో తెలుగు వారి ఓట్లు ఏ రాజకీయ పార్టీకి పడనున్నాయోనని రాజకీయ పరిశీలకులంటున్నారు. తమిళనాడు రాష్ర్టంలో 40 శాతం తెలుగువారున్నారు. రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు వారి మాతృభాష తెలుగులో చదువుకుంటున్నారు. 2006లో అప్పటి డీఎంకే ప్రభుత్వం నిర్బంధ తమిళభాషా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంను అప్పట్లో తెలుగు భాషా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 2011లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ జయకేతనం ఎగురవేసింది. జయలలిత ముఖ్యమంత్రి కావడంతో సమస్యలు పరిష్కారమవుతాయని పలువురు భావించారు.
జయలలిత పట్టించుకోలేదు. ఈ విషయంపై హొసూరు ఎమ్మెల్యే కే.గోపీనాథ్, తళి టి.రామచంద్రన్, వాణియంబాడి ఎమ్మెల్యేలు శాసనసభలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రాష్ర్టంలో భాషా అల్పసంఖ్యాకుల భాషా సమస్యలు పరిష్కరించలేదు. తీరా చూస్తే నిర్బంధ తమిళ భాషా చట్టానికి పదును పెట్టారు. ఇందువల్ల 2016 విద్యాసంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే మైనార్టీ విద్యార్థులు అయోమయంలో పడ్డారు. తెలుగు, కన్నడ, మళయాళ, ఉర్దూ విద్యార్థులు నిర్బంద తమిళభాషా భోదనా విధానంతో విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన చెందారు. చివరి నిమిషంలో తెలుగు సంఘాలు పోరాటాన్ని ఉధృతం చేశారు. అయినా ముఖ్యమంత్రి జయలలిత పట్టించుకోలేదు.
హొసూరు ఎమ్మెల్యే కే. గోపీనాథ్ హైకోర్టును ఆశ్రయించటంతో, చివరి నిమిషంలో విద్యార్థులు వారివారి మాతృభాషల్లో పబ్లిక్ పరీక్షలు రాసేందుకు కోర్టు అవకాశం కల్పించింది. విద్యార్థులు నిర్బంధ తమిళభాషా చట్టంతో వేదనకు గురైయ్యారు. ఈ విషయమై అప్పట్లో జయప్రభుత్వం పట్టించుకోలేదు. విద్యార్థుల ఉసురు జయకు తప్పకుండా తగులుతుందని తెలుగు భాషాభిమానులు, రాజకీయ పరిశీలకులు అంటున్నారు.